తిట్ల పురాణం: కెసిఆర్, కోదండలకు విశాఖకోర్టు సమన్లు

కెసిఆర్, కోదండలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి విశాఖ న్యాయ సదన్ కోర్టులో రెండు రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు ఈ రోజు కెసిఆర్, కోదండరామ్‌లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 15న విశాఖ కోర్టు హాజరు కావాలని కోర్టు వారికి ఆదేశాలు జారీ చేసింది.
కాగా దేశంపై, ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అందిన ఫిర్యాదులపై సీమాంధ్రలో వరుసగా కెసిఆర్ పైన కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం గుంటూరులోని ఆరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో కెసిఆర్‌పై సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ఫిర్యాదు చేశారు. సీమాంధ్రులను దొంగలు అనడంపై కెసిఆర్ మీద ఫిర్యాదు చేశారు. అలాగే, దిక్కుమాలిన దేశంలో తెలంగాణ కోసం ఇంకా ఎన్ని ఉద్యమాలు చేయాలని కెసిఆర్ ప్రశ్నించడంపై, చప్రాసీకి ఉన్న తెలివి ప్రధానికి లేదని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా వారు ఆరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
విజయవాడలోని మాచవరం పోలీసు స్టేషన్‌లో మాజీ శానససభ్యుడు అడుసుమిల్లి జయప్రకాష్ కెసిఆర్‌పై ఫిర్యాదు చేశారు. దేశంపై, ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, కెసిఆర్‌పై కేసులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications