భారత బ్రాండ్ వర్ధిల్లాలి, యువతనే కొత్త శక్తి: మోడీ
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ అహింసా ఉద్యమం, కొంత మంది స్వాతంత్ర్య సమరయోధుల సాయుధ పోరాటం దేశానికి స్వాతంత్ర్యం ప్రసాదించాయని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (ఎస్‌ఆర్‌సిసి)లో ఆయన బుధవారం ప్రసంగించారు. బిజినెస్ కాంక్లేవ్ 2013 ముగింపు కార్యక్రమంలో ఆయన శ్రీ రామ్ స్మారకోపన్యాసం చేశారు. సుపరిపాలన, ప్రజాహిత విధానాల అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
తాను గత నాలుగు పర్యాయాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ వస్తున్నాని, ప్రభుత్వ కార్యాలయాల్లో అదే అధికారుల బృందం ఉందని, అయినా అనూహ్యమైన అభివృద్ధిని సాధించామని ఆయన అన్నారు. నిరాశావాదంలో కూరుకుపోవద్దని, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన విద్యార్థులకు ఉద్బోధించారు.
గుజరాత్ ప్రభుత్వం వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి, సేవా రంగానికి ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పారు. ఇటీవలి వైబ్రంట్ గుజరాత్ సదస్సును గుర్తు చేస్తూ తమ రాష్ట్రం ప్రపంచమంతటి నుంచీ పెట్టుబడులు రాబట్టగలిగిందని మోడీ చెప్పారు. రాష్ట్రంలో కొన్ని నెలలు వాతావరణం అనుకూలించనప్పటికీ పత్తి రైతులు పెద్ద యెత్తున దిగుబడి సాధించారని ఆయన అన్నారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు.

గుజరాత్‌లో ఉత్పత్తి అయిన పాడి, ఇతర ఆహార ఉత్పత్తులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కనిపిస్తాయని ఆయన చెప్పారు. తమ ఉత్పత్తులను వేగంగా రవాణా చేయడానికి తమ ప్రాంతాల్లో మంచి రోడ్లు వేయాలని గిరిజనులు అడిగారని, దీన్ని బట్టి వారి ఆకాంక్షలేమిటో అర్థమవుతాయని అన్నారు.
క్రమం తప్పకుండా పశు శిబిరాలను నిర్వహించడం వల్ల పశువులకు వచ్చే 120 వ్యాధులను అరికట్టగలిగామని ఆయన చెప్పారు. దాంతో పాడి పరిశ్రమ అభివృద్ధి చెంది పాల ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. జాతీయ సగటుతో చూసుకుంటే గుజరాత్ పర్యాటక రంగంలో విశేషంగా అభివృద్ధి చెందిందని చెప్పారు.
సేవా రంగాన్ని తాము విశేషంగా అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ విషయానికి వస్తే గుజరాత్ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని, కొన్ని కేసుల్లో ఇజ్రాయెల్ కూడా గుజరాత్ పోలీసుల సహాయం కోరుతోందని మోడీ చెప్పారు.
గుజరాత్‌లో దేశంలోనే మొదటిసారి భారత ఉపాధ్యాయ విద్యా సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల అవసరం అందరికీ ఉంటుందని, ఉపాధ్యాయులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం తమ లక్ష్యమని ఆయన చెప్పారు.
<center><center><center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/LwL6zIecOjU" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>
గతంలోని మేడ్ ఇన్ జపాన్ బ్రాండ్ మాదిరిగా భారత బ్రాండ్ వెలిగిపోవాలని ఆయన ఆశించారు. ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించిన ఏడేళ్ల తర్వాత కూడా రెస్టారెంట్లలో క్రాకరీ, బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు చూసినట్లు ఆయన తెలిపారు. 1988 సియోల్ ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా దక్షిణ కొరియా అదే విధమైన ప్రమోషన్‌కు దిగిందని చెప్పారు. భారత్ కూడా కొన్ని ఉదాహరణలను తీసుకుని దేశం తయారయ్యేవాటికి ప్రచారం కల్పించాలని ఆయన అన్నారు.
రాజకీయ పార్టీలు యువతను కేవలం ఓటర్లుగా మాత్రమే చూడకుండా నూతన యువశక్తిగా పరిగణించాలని ఆయన సూచించారు. దేశాలను భారత్ ముందుండి నడిపించాలని వివేకానంద కలలు కన్నాడని, ఆ కలను సాకారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ప్రపంచమంతా చూస్తుండగానే 21వ శతాబ్దంలో భారత్ అభివృద్ధి చెందాలని ఆయన ఆశించారు. దేశం మంత్రతంత్రాలకు, పాములు పట్టేవారికి నిలయమనే అభిప్రాయం ఉండేదని, ఇప్పుడు మారు మూల గ్రామాల్లో కూడా కంప్యూటర్ మౌస్‌లు కనిపిస్తున్నాయని అన్నారు.
వేగం, నైపుణ్యం, కొలబద్దలు ప్రగతికి కీలకమైన అంశాలని ఆయన చెప్పారు. భారత నిర్మాణ ప్రక్రియలో పాలు పంచుకోవాలని యువతను కోరుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!