కొమ్మూరి కేసు: హైకోర్టుకు హాజరైన మంత్రి పొన్నాల

పొన్నాల లక్ష్మయ్య 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయగా, కొమ్మూరి ప్రతాప రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోటీ చేశారు. స్వల్ప మెజారిటీతో గెలిచిన పొన్నాల లక్ష్మయ్యపై కొమ్మూరి ప్రతాప రెడ్డి న్యాయ పోరాటానికి దిగారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత కొమ్మూరి ప్రతాపరెడ్డి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చొరవతో కాంగ్రెసు పార్టీలోకి రావడానికి సిద్ధపడ్డారు.
వైయస్ రాజశేఖర రెడ్డి కారణంగా కొమ్మూరి ప్రతాపరెడ్డి పొన్నాల లక్ష్మయ్యపై న్యాయ పోరాటం విషయంలో అప్పట్లో కాస్తా వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం కొమ్మూరి ప్రతాపరెడ్డి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు.
తెరాస అధినేత కె. చంద్రశేఖర రావుతో కొమ్మూరి ప్రతాపరెడ్డి, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నాయకుడు కెకె మహేందర్ రెడ్డి తీవ్రంగా విభేదించారు. వీరిద్దరు కూడా ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తెలంగాణ ప్రాంతంలో ముఖ్య నాయకులుగా చెలామణి అవుతున్నారు. పొన్నాల లక్ష్మయ్య ఎన్నిక చెల్లదంటూ కొమ్మూరి ప్రతాపరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
తనపై విచారణపై స్టే ఇవ్వాలని కోరుతూ పొన్నాల లక్ష్మయ్య గతంలో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, మంత్రి అయి ఉండి తమ వద్దకు రావడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించి, ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఆయనకు జరిమానా కూడా విధించింది.












Click it and Unblock the Notifications