షర్మిలా! సోనియా కాళ్లు పట్టుకున్నదెవరు?: గాలి ఫైర్

షర్మిల కాలికి ఆపరేషన్ కాలేదని తెలుగుదేశం పార్టీ అనలేదన్నారు. ఏ కాలికి అయిందో చెప్పాలని మాత్రమే అడిగామన్నారు. వైయస్ జగన్‌కు ముఖ్యమంత్రి పదవి కోసం నాడు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్లు, బెయిల్ కోసం ఇప్పుడు ఢిల్లీ పెద్దల కాళ్లు ఎవరు పట్టుకుంటున్నారో అందరికీ తెలుసునని షర్మిల వ్యాఖ్యలపై గాలి ముద్దుకృష్ణమ నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నాడు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పలు పిటిషన్లు, విచారణలు వేశారన్నారు. బాబు తప్పు చేసినట్లు ఎక్కడా తేలలేదని, కొన్నింటిన వైయస్ ఉపసంహరించుకున్నారని అన్నారు. అప్పుడు చంద్రబాబు తన కాళ్లు పట్టుకోవాలని అన్నారా? అని ప్రశ్నించారు. జగన్ పార్టీ సెంటిమెంట్ డ్రామా ఆడుతోందన్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కోరిక ఉంటే గవర్నర్‌కు లేఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.
జలయజ్ఞం కింద ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని, కాంగ్రెసు నేతలు జలయజ్ఞాన్ని ధన యజ్ఞం చేశారని టిడిపి నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మరో రూ.2 లక్షల కోట్లు కావాలని, మెగా ఇంజనీరింగ్ సంస్థల నుంచి అవసరం లేకున్నా యంత్రాలు కొని నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
షర్మిలకు ఎన్నికల నియమావళి సూచనలు
నల్గొండ జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న షర్మిలకు జిల్లా ఎన్నికల అధికారులు ఎన్నికల నియమావళి సూచనల ప్రతిని అందజేశారు. నల్గొండలో ఎన్నికలు ఉన్న దృష్ట్యా దీనిని అంద జేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!