రెక్కీ నిర్వహించి.. సిసి వైర్లు తెంచి: మక్బూల్ పనేనా?

ఘటనకు నాలుగు రోజుల క్రితమే నిందితులు స్థానిక లాడ్జీలలో తిష్ట వేసినట్లుగా అనుమానిస్తున్నారు. తమ గుర్తులు తెలియకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారట. నాలుగైదు రోజులు రెక్కీ నిర్వహించినట్లుగా అనుమానిస్తున్నారు. లాడ్జీలో మకాం వేసిన నిందితులు ఎక్కడ పేల్చాలి, ఏ సమయంలో పేల్చాలనే విషయంపై ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట. ఆయా ప్రాంతాల్లోని సిసి కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేశారని భావిస్తున్నారు.
సిసి కెమెరాలు పని చేయకపోవడమే ఈ అనుమానాలకు తావిస్తోంది. పలు సిసి కెమెరాల వైర్లు ఎక్కడికి అక్కడ కట్ చేసి ఉన్నట్లుగా గుర్తించారు. పేలుళ్లకు పాల్పడింది ఎవరో తెలియకుండా ఉండేందుకే చేశారు. తీవ్రవాదులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించడంతో నిఘా వర్గాలకు ఆనవాళ్లు కనిపెట్టడం కష్టంగా మారినట్లుగా కనిపిస్తోంది. సిసి కెమెరాలను బాగు చేసే వ్యక్తి రాని కారణంగా అవి అలాగే ఉండిపోయాయని దీంతో నిందితులను గుర్తించడం కష్టంగా మారుతోందట. సాయిబాబా గుడి వద్ద గల సిసి కెమెరా ఫుటేజ్‌ను ఎన్ఐఏ పరిశీలిస్తోంది.
మక్బూల్ పనేనా?
మరోవైపు దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన మక్బూల్ పనే అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఏడాదిగా ఉన్న సయ్యద్ మక్బూల్ అనే వ్యక్తిని గత ఏడాది నవంబరులో అరెస్టు చేశారు. తాము రద్దీగా ఉండే దిల్‌సుఖ్ నగర్, అబిడ్స్, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో పేలుళ్లు జరుపాలని భావించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది. మక్బూల్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీ జైలులో ఉన్న మక్బూల్‌ను పూర్తిస్థాయిలో విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఆసుపత్రుల్లో ఆర్తనాదాలు
బాంబు పేలుళ్ల ఘటనలో క్షతగాత్రులు నగరంలోని ఎనిమిది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. పలు ఆసుపత్రుల్లో బంధువుల రోదనలు మిన్నంటాయి. చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి బంధువులతోనే ఆసుపత్రులు పూర్తిగా నిండిపోయాయి. ఈ ఘటనలో 119 మంది గాయపడగా.. అందులో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications