పేలుళ్లు: బాంబు తయారీకి అమ్మోనియం నైట్రేట్ వాడారు

పేలుళ్ల ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇండియన్ ముజాహిదీన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. సిసిటీవి ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు. సిసిటీవి ఫుటేజీ గంట నిడివి ఉన్నట్లు తెలుస్తోంది. దిల్‌షుక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సిసిటీవీలు కేవలం ట్రాఫిక్‌కు సంబంధించినవేనని, అవి రోడ్డు మీద దృశ్యాలను మాత్రమే చిత్రీకరిస్తాయని, రోడ్డు పక్కల దృశ్యాలను చిత్రీకరించే అవకాశం లేదని ఆయన అన్నారు.
పేలుళ్ల కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని ఆయన ఘటనా స్థలంలో శుక్రవారం చెప్పారు. పేలుళ్లకు సంబంధించి ఘటనా స్థలంలో చాలా ఆధారాలు లభించాయని, త్వరలోనే కేసును ఛేదిస్తామని, వాటిని వెల్లడించడం సరి కాదని ఆయన అన్నారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని ఆయన అన్నారు. నగర ప్రజలకు రక్షణ కల్పించడమే తమ తక్షణ కర్తవ్యమని ఆయన అన్నారు. చెడుదారి పట్టిన వ్యక్తులే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని ఆయన అన్నారు.
నిందితుల గురించి సమాచారం ఇస్తే పారితోషికం ఇస్తామని చెప్పారు. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఘటనపై నాలుగు బృందాల ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు.
బాంబు పేలుళ్లు జరిగిన ప్రదేశాన్ని కేంద్ర మంత్రి, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ సందర్శించారు. బాధ్యులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు. ఘటనకు పాల్పడినవారు స్వదేశీయులైనా, విదేశీయులైనా వదేలేది లేదని అన్నారు. దుర్ఘటనను మతానికి ఆపాదించడం సరి కాదని ఆయన అన్నారు. ఇలాంటి సంఘటనల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని అన్నారు.
కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూడా శుక్రవారం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. జంట పేలుళ్ల సంఘటన దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. పేలుళ్ల వల్ల ఎవరికీ లాభం లేదని, కేవలం బద్ధ శత్రువులే ఈ పనికి ఒడిగట్టారని ఆయన అన్నారు












Click it and Unblock the Notifications