హైదరాబాద్ పేలుళ్లు: నెల్లూరు జైలు లింక్, విచారణ
హైదరాబాద్: హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్లపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జైళ్లలో ఉన్న ఉగ్రవాదుల నుంచి సమాచారం రాబట్టేందుకు దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. నెల్లూరు జిల్లా జైలుకు హైదరాబాదు పేలుళ్లకు లింక్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల ప్రధాన సూత్రధారిగా మక్బూల్‌ను దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ స్థితిలో నెల్లూరు జైలులో ఉన్న ఇద్దరు వ్యక్తులపై దర్యాప్తు అధికారుల దృష్టి పడింది. మక్బూల్ నెల్లూరు జిల్లాలో ఉన్న సిరాజ్, అలీ బాయ్ అనే ఇద్దరు పాత నేరస్థులను నిరుడు ఏప్రిల్ 21వ తేదీన కలుసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
హైదరాబాదు పేలుళ్లకు అక్కడేమైనా పథకం రచించారా అనే అనుమానాలతో దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టారు. సిరాజ్, అలీ భాయ్‌లను ప్రశ్నించడానికి వారు సమాయత్తమైనట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరితో మక్బూల్ జైలులో దాదాపు గంటకు పైగా ఏకాంతంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయాలను నెల్లూరు జిల్లా అధికారులు ధ్రువీకరించడం లేదు.

గురువారం సాయంత్రం దిల్‌షుక్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో 16 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇంకా పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో ఇద్దరి పరిస్థితి, ఓమ్నీలో చికిత్స పొందుతున్నవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. చర్లపల్లి జైలులో దాడి తర్వాత సిరాజ్, అలీ బాయ్‌లను నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications