గొట్టిపాటికి హామీ: జగన్ పార్టీలో చిచ్చు, ఆఫీస్ ముట్టడి

ఇది పార్టీలో ముఖ్యంగా అద్దంకి నియోజకవర్గంలో సెగ రాజేసింది. అద్దంకి నియోజకవర్గం పైన జగన్ పార్టీ తరఫున మొదటి నుండి గరటయ్య ఆశలు పెట్టుకున్నారు. ఆయన మొదటి నుండి పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు జగన్ నుండి హామీ వచ్చిందని గొట్టిపాటి చెప్పడంతో అద్దంకి నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు, గరటయ్య వర్గం కార్యకర్తలు హైదరాబాదులోని పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు తరలి వచ్చారు.
మొదటి నుండి పార్టీ కోసం పని చేస్తున్న గరటయ్యను కాదని గొట్టిపాటి రవి కుమార్‌కు అద్దంకి సీటు ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. గరటయ్యకు న్యాయం జరిగే వరకు తాము పార్టీలోనే బైఠాయిస్తామని, గొట్టిపాటికి ఇస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. పార్టీ కార్యాలయం నుండి బయటకు వెళ్లాలని నేతలు హెచ్చరించినా వారు తగ్గలేదు. అద్దంకి కార్యకర్తలు మీడియాతో మాట్లాడుతుండగా పలువురు అడ్డుకున్నారు. పరిస్థితి సెగ రాజేసేలా ఉండటంతో పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. ఈ విషయమై వారు చర్చిస్తున్నారు.
కాగా రెండు రోజుల క్రితం గొట్టిపాటి రవి కుమార్ జగన్‌ను కలిసిన అనంతరం మాట్లాడుతూ.. తాను త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతానని, తనకు అద్దంకి నియోజకవర్గ శాసన సభ సీటుపై హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. దీంతో గరటయ్య వర్గం ఆసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కేవలం అద్దంకి నియోజకవర్గంలోనే కాకుండా పలు ఇతర నియోజకవర్గాలలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications