అందుకే మక్బుల్‌కి వైఎస్ క్షమాభిక్ష: గాలి, గవర్నర్ సైన్

Posted By:
Subscribe to Oneindia Telugu
Maqbool
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్భలంతోనే తీవ్రవాది సయీద్ మక్బూల్‌కు క్షమాభిక్ష పెట్టారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం ఆరోపించారు. అరబ్ దేశాల్లో ఆస్తులను దాచుకునేందుకే వైయస్ మక్బూల్‌కు క్షమాభిక్ష పెట్టారని విమర్శించారు. తీవ్రవాదులతో సంబంధం ఉన్న మక్బూల్‌కు క్షమాభిక్ష ఎందుకు పెట్టారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దీనిపై హోంమంత్రి పెదవి విప్పాలన్నారు. ఈ అంశంపై ఎన్ఐఏ పూర్తిగా విచారణ చేయాలన్నారు.

మరోవైపు సయీద్ మక్బూల్ క్షమాభిక్ష రద్దు పైలుకు గవర్నర్ నరసింహన్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు. ఇండియన్ ముజాహిదన్ ఉగ్రవాది మక్బూల్‌కు క్షమాభిక్షను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఫైలును ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ సిఎం పంపిన ఫైలుపై సంతకం చేసి ఆమోద ముద్ర వేశారు.

కాగా, దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల నేపథ్యంలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్‌‌కు ప్రసాదించిన క్షమాభిక్షను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మక్బూల్‌కు 2009లో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో క్షమాభిక్ష ప్రసాదించిన విషయం తెలిసిందే. గతంలో నిజామాబాద్‌లో కృష్ణమూర్తిని హత్య చేసిన మక్బూల్‌ అరెస్టు అయ్యాడు.

సత్ప్పవర్తన కలిగిన ఖైదీల విడుదలలో భాగంగా మక్బూల్ జైలు నుంచి విడుదలయ్యాడు. మక్బూల్‌కు వైఎస్‌ క్షమాభిక్ష ప్రకటించడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి దీనికి సంబంధించిన జీఓ 338, హోం డేటెడ్‌ 24-7-2009న రెమిషన్‌ కోసం మార్గదర్శకాలు రూపొందించేందుకు వైయస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆ తర్వాత సెప్టెంబర్‌ 2న వైయస్ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన రోశయ్య ఆ జీఓను యధాతథంగా అమలుచేశారు. ప్రస్తుతం తీహార్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్న మక్బూల్‌ను దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుడు కేసు నేపథ్యంలో నగరానికి తీసుకువచ్చి, సోమవారమే ఢిల్లీకి తరలించారు. వైయస్ క్షమాభిక్షతో జైలు నుంచి బయటకు వచ్చిన మక్బూల్‌ 2012లో ఉగ్రవాద కార్యక్రమాల్లో పాల్గొనడంతో అరెస్టయ్యాడు. హైదరాబాద్‌ నగరంలో 10 చోట్ల పేలుళ్లకు రిక్కీ నిర్వహించాడు.

మక్బూల్‌కు క్షమాభిక్ష పెట్టిన విషయాన్ని బాంబు పేలుళ్ల తర్వాత జరిగిన సమీక్ష సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి ఆలస్యంగా తీసుకువెళ్లారు. హోంమంత్రి సబిత కూడా దానిపై సమీక్ష నిర్వహించారు. ఈ ఫైలుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Governor Narasimhan has sigined on Government's remission cancellation file of Terrorist Syed Naqbool on Tuesday.
Please Wait while comments are loading...