రాయపాటిపై చెక్ బౌన్స్ కేసు: హాజరు కావాలని ఆదేశం

గతంలో జారీ చేసిన ఆదేశాల మేరకు రాయపాటి సాంబశివ రావు శుక్రవారం కోర్టు ముందు హాజరు కావాల్సి ఉండింది. ఆయన గైర్హాజర్ కావడంతో మెజిస్డ్రేట్ ఆయనపై నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేశారు. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున తాను హాజరు కాలేపోయారని రాయపాటి తరపు న్యాయవాది పదే పదే కోర్టుకు విన్నవించుకున్నారు.
దాంతో వారంట్లను ఉపసంహరించుకుటూ ఏ విధమైన వాయిదా కోరకుండా ఏప్రిల్ 18వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు రాయపాటి సాంబశివ రావును ఆదేశించింది. రాయపాటికి చెందిన జయలక్ష్మి స్పిన్నింగ్ మిల్లు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి 2003లో రూ. 31.29 కోట్లు రుణంగా తీసుకుంది. ఈ రుణాల చెల్లింపులు సక్రమంగా జరగలేదు. దీంతో బ్యాంక్ రికవరీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. దీనికి సంబంధించిన వివాదం హైకోర్టు దాకా వెళ్లింది.
ఈ స్థితిలో జయలక్ష్మి స్పిన్నింగ్ మిల్లు పేరుతో రాయపాటి సాంబశివ రావు రూ. 2 కోట్లకు బ్యాంకుకు చెక్ ఇచ్చారు. చెక్ చెల్లకపోవడంతో ఐసిఐసిఐ బ్యాంక్ 2006లో కేసు దాఖలు చేసింది. ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టి కోర్టు శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. విచారణకు రాయపాటి హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసింది. న్యాయవాది విజ్ఞప్తితో వాటిని ఉపసంహరించుకుని ఏప్రిల్ 18వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
అదే రోజు పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుందని కూడా కోర్టు స్పష్టం చేసింది. రుణం చెల్లింపులో భాగంగా పోలవరం ప్రాజెక్టు టెండర్లను దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్ పేరు మీద రూ. 6 కోట్లకు సాంబశివరావు జారీ చేసిన చెక్ కూడా బౌన్స్ అయింది. ఈ కేసు కోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications