జగన్ ఫ్యామిలీలో వార్, వీరేనా!? వివేకా ట్విస్ట్(పిక్చర్స్)
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో టిక్కెట్ల కోసం విబేధాలు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, పార్టీలోనే కాదు.. వైయస్ కుటుంబంలోనూ టిక్కెట్ల కోసం వార్ జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. కడప జిల్లా వైయస్ కుటుంబానికి పెట్టింది పేరు. ముప్పయ్యేళ్లకు పైగా జిల్లాలో వైయస్ కుటుంబానిదే హవా. అలాంటి కడపలో టిక్కెట్ల కోసం జగన్ కుటుంబ సభ్యులు క్యూ కడుతున్నారట.
వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిచి ముఖ్యమంత్రి అవుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతోంది. దీంతో జగన్ ఆ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న కడప స్థానం ఖాళీ అవుతుంది. ఇందుకోసం కుటుంబంలో పోటీ నెలకొందట. జగన్ జైలుకు వెళ్లాక పార్టీ పటిష్టత కోసం మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిల కడప స్థానంపై ఆసక్తి చూపిస్తున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి.
అదే సమయంలో జగన్ మాత్రం ఆ స్థానంలో సోదరుడు వైయస్ అవినాష్ రెడ్డిని నిలబెట్టేందుకు ఇప్పటికే మాటిచ్చేశారట. దీంతో షర్మిల అసంతృప్తికి లోనయినట్లుగా కూడా ప్రచారం జరిగింది. కడప స్థానంపై షర్మిల, అవినాష్ రెడ్డితో పాటు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నారట. ఇక, జగన్ పులివెందులకు వెళితే తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కమలాపురం నుండి పోటీ చేస్తారని చెబుతున్నారు.
విజయమ్మ పోటీ చేస్తే అందరూ దూరంగా ఉంటారు. అయితే, ఆమెను కడపకు లేదా ఇతర నియోజకవర్గానికి పంపించిన పక్షంలో రవీంద్రనాథ్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారట. మరో ట్విస్ట్ ఏమంటే కడప ఎంపీ సీటుకు వైయస్ వివేకానంద రెడ్డి ఆ సీటు కోసం పట్టుబడుతున్నారట. తాను మొదట అదే సీటు నుండి పోటీ చేశానని, జగన్ కోసం ఆ సీటును తాను త్యాగం చేశానని, కాబట్టి తనకే ఇవ్వాలని కోరుతున్నారట. అయితే, తొలి నుండి జగన్‌కు మద్దతుగా నిలవక పోవడంతో ఆయనకు అంత ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చునని అంటున్నారు. కడప జిల్లాలో తమకు అనువుగా ఉన్న నియోజకవర్గాల్లో జగన్ కుటుంబ సభ్యులు టిక్కెట్ల కోసం ఆసక్తి కనబరుస్తుండటం జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశమైందట.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం, బంధువుల్లో పలువురు కడప జిల్లాలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.

కడప నుండి పోటీ చేసేందుకు పార్టీ పటిష్టత కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిల ఆసక్తి కనబరుస్తున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే, ఆ సీటులో అవినాష్ రెడ్డి పోటీ చేసేందుకు రెడీ అవుతుండటంతో షర్మిల అసంతృప్తికి గురయినట్లుగా చెప్పారు.

కడప స్థానాన్ని జగన్ కోసం తానిచ్చానని, జగన్ పులివెందులకు వెళ్లదల్చుకుంటే అదే టిక్కెట్ తనకివ్వాలని వైయస్ వివేకానంద రెడ్డి అడుగుతున్నారట.

జగన్ పులివెందుల నుండి పోటీ చేస్తే విజయమ్మ కమలాపురం నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కడప నుండి సోదరుడు అవినాష్ రెడ్డిలోకి బరిలోకి దింపేందుకు జగన్ హామీ ఇచ్చారట. జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా కడప లేదా కమలాపురం నుండి ఆసక్తి కనబరుస్తున్నారట.

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు టిక్కెట్ల కోసం బయటి నుండే కాకుండా కుటుంబం లేదా బంధువుల నుండి తలనొప్పి ఉండే అవకాశముందంటున్నారు.












Click it and Unblock the Notifications