తెలంగాణ: నరేంద్ర మోడీతో ఒకే వేదికపై కెసిఆర్!

దీంతో తెలంగాణపై స్పష్టతతో ఉన్న బిజెపితో కలిసి వెళ్లేందుకు కెసిఆర్ ఆసక్తి కనబరుస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకోసం ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి తెలంగాణ ప్రాంతంలో వేదికను పంచుకోనున్నారట. 2014లో ఎన్డీయే ప్రధానిగా మోడీ అంటూ ప్రచారం జరుగుతోంది. గుజరాత్‌లో వరుస విజయాల నేపథ్యంలో ఆయన దేశవ్యాప్తంగా ఆకర్షింపబడుతున్నారు.
అలాంటి మోడీ త్వరలో తెలంగాణ ప్రాంతంలో ఓ బహిరంగ సభలో పాల్గొననున్నారట. ఆ సభలో కెసిఆర్ పాల్గొని బిజెపి వైపు తొలి అడుగు వేయనున్నారట. తెలంగాణ సాధన కోసం టిఆర్ఎస్ ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధంగా ఉందని, ఎన్డీయేతో కూడా కలుస్తామని తెరాస ఎమ్మెల్యే ఒకరు ఆంగ్ల దిన పత్రికతో చెప్పారు. తమకు తెలంగాణే ముఖ్యమన్నారు. కాంగ్రెసు తెలంగాణపై మోసం చేసిందని చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు అనుకూలంగా ఉన్న ఎన్డీయేతో కలిసి వెళ్లేందుకు వ్యతిరేకత లేదని అభిప్రాయపడ్డారు. తెరాస తెలంగాణ ప్రాంతంలో ప్రధాన రాజకీయ పార్టీగా ఉందని చెప్పారు. అయితే, ఎవరితో కలిసి వెళ్లాలి? ఎన్నికల్లో పొత్తులపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు మోడీ మార్చి నెలాఖరులోగా ఎపిలో పర్యటించే అవకాశాలు ఉన్నాయట. ఆయన తెలంగాణ ప్రాంతంలో పర్యటించే అవకాశముందంటున్నారు.
అతను ఓ బహిరంగ సభలో పాల్గొననున్నారని బిజెపి చెబుతోంది. గుజరాత్‌లో బిజెపి గెలిచినప్పుడే మోడి తెలంగాణలో పర్యటిస్తారనే వాదన వచ్చింది. ఇప్పుడు మార్చి నెలాఖరులోగా పర్యటించే అవకాశాలున్నాయంటున్నారు. మోడీ పర్యటన పైన స్పందించేందుకు కెటిఆర్ నిరాకరించారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న బిజెపి నేత మోడీ బహిరంగ సభలో కెసిఆర్ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మోడీని ఎపికి ఆహ్వానించినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పారు.
మరోవైపు నాగర్ కర్నూలు నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి కూడా తెలంగాణ కోసం ఎన్డీయేతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ అనుకూల పార్టీలు, నాయకులు అందరూ ఎన్డీయే గొడుకు కిందకు రావాలని నాగం జనార్ధన్ రెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications