బాబు, జగన్‌లకు కౌంటర్: అవిశ్వాసానికి తెరాస రెడీ

తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని బిజెపి నాయకులు చెప్పారని, తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా మద్దతిస్తామని అన్నారు. సిపిఐ, సిపిఎం, లోకసత్తా, మజ్లీస్ పార్టీలను తాము సంప్రదించామని, సముఖత వ్యక్తం చేస్తూనే పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఆ పార్టీల నాయకులు చెప్పారని ఆయన వివరించారు.
తెలంగాణ అంశం, ప్రజా సమస్యలు కలిసే ఉంటాయని కెసిఆర్ అన్నారు. అవసరమైతే తాము శానససభను స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు. తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని, ఎవరు కలిసి వస్తారో ఎవరు కలిసి రారో తేలిపోతుందని కెసిఆర్ అన్నారు. రైతులకు ఇప్పుడు ఐదు గంటలు కూడా విద్యుత్తు అందడం లేదని ఆయన అంటూ ఏడు గంటలు విద్యుత్తును అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వస్త్ర వ్యాపారుల ఆందోళనకు మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు నిజమని అనుకుంటే అవిశ్వాస తీర్మానానికి కలిసి రావాలని ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. తాను, విజయశాంతి మూడు నాలుగు రోజుల్లో ఢిల్లీ వెళ్తామని, తెలంగాణపై పార్లమెంటును స్తంభింపజేస్తామని ఆయన చెప్పారు.
ప్రభుత్వాన్ని కూల్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వాన్ని కూల్చడానికి తగిన సంఖ్యా బలం ఉందని వైయస్సార్ కాంగ్రెసు చూపించినా, మరో పార్టీ చూపించినా, ఆ మేరకు తమకు నమ్మకం కలిగిస్తేనే మద్దతు ఇస్తామని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు. తెరాస మాటలకు, చేతలకు చాలా తేడా ఉంటుందని ఆనయ అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు నోటీసు ఇచ్చిన తర్వాత పార్టీల వైఖరులు బయటపడుతాయని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనపై తాము విస్తృతంగా చర్చించామని, ఈ విషయంపై సభలోనే మాట్లాడాలని అనుకున్నామని ఆయన అన్నారు.
ప్రజా ప్రయోజనాల కోసం ఎవరు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినా తాము మద్దతు ఇస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని ఆమె అన్నారు. ప్రజా సమస్యలపై కెసిఆర్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని, ప్రభుత్వాన్ని కూలదోయాలని మాత్రమే ప్రతిపాదిస్తున్నారని రాష్ట్ర మంత్రి పార్థసారథి అన్నారు.












Click it and Unblock the Notifications