పాక్‌లో దైవదూషణ చిచ్చు: క్రిస్టియన్ వర్సెస్ ముస్లిమ్స్

దైవదూషణ ఆరోపణలపై రేగిన చిచ్చు ఇది. ఈ ఘటనతో లాహోర్‌లోని జోసెఫ్ కాలనీ భీతిల్లింది. ఈ మూకుమ్మడి దాడిపై పాకిస్తాన్ సుప్రీం కోర్టు సుమోటో విచారణ చేపట్టింది. పంజాబ్ పోలీస్ చీఫ్, ప్రొవిన్షియల్ అడ్వకేట్ సోమవారం తమ ముందు హాజరు కావాలంటూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తికార్ చౌధురి సమన్లు జారీ చేశారు. దాడిపై వివర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
కాగా మహ్మద్ ప్రవక్తను దూషించారనే ఆరోపణలపై షఫీక్ మహ్మద్ నేతృత్వంలో ముస్లింలు విధ్వంసానికి దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. దైవ దూషణకు పాల్పడిన సవన్ మాసీ తండ్రి చమన్ మాసీపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఆయన ఇంటిని తగులబెట్టారు. కాగా తాగిన మైకంలో ఇద్దరు స్నేహితుల మధ్య మాటా మాటా పెరిగి, చివరకు దేవుడ్ని నిందించే స్థాయికి చేరి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకొన్నాయని పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన శనివారం దాడులు, ఇళ్ల దహనానికి దారితీసింది. 97 శాతం ముస్లిం జనాభా కలిగిన పాకిస్థాన్‌లో దైవదూషణ ఎంతో సున్నితమైన అంశం. ప్రవక్తపై నిందాపూర్వక వ్యాఖ్యలు చేసిన మాసీపై ఆయన ముస్లిం స్నేహితుడు షాహిద్ ఇమ్రాన్ ఫిర్యాదు చేశారు. దీంతో మాసీని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఎన్నో ఏళ్లుగా వారిద్దరూ స్నేహితులని సీనియర్ పోలీసు అధికారి ముల్తాన్‌ఖాన్ చెప్పారు. శనివారం నాటి దాడులకు సంబంధించి 150 మందిని అదుపులోకి తీసుకొన్నామని పంజాబ్ ప్రొవిన్స్ సర్కారు అధికార ప్రతినిధి పెర్వేజ్ రషీద్ తెలిపారు. మరోవైపు తమ ఇళ్లను తగులుబెట్టినందుకు వందలాది మంది క్రిస్టియన్స్ ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications