1993 బొంబాయి బాంబు పేలుళ్లు: అప్పుడేమైంది?
ముంబై: అప్పట్లో ముంబై వరుస బాంబు పేలుళ్ల సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. 1993 మార్చి 12వ తేదీన ముంబై 13 చోట్ల వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 257 మంది మరణించారు. మరో 713 మంది గాయపడ్డారు. దావూద్ ఇబ్రహీం ఈ బాంబు పేలుళ్లకు కుట్ర చేశాడని సుప్రీంకోర్టు నిర్ధారణకు వచ్చింది. దావూద్ ఇబ్రహీం కుటుంబ సభ్యులు, డి - కంపెనీ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు. 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు.
పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లు శిక్షణ తీసుకుని పథకం ప్రకారం పెద్ద యెత్తున పేలుళ్లకు పాల్పడ్డారు. టైగర్ మెమెన్ సహకారంతో దావూద్ ఇబ్రహీం పథకం ప్రకారం ఈ పేలుళ్లకు కుట్ర చేశాడని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో గానీ దుబాయ్‌లో గానీ ఉండవచ్చునని భావిస్తున్నారు. దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమెన్, అతని సోదరుడు అయూబ్ మెమెన్ ప్రధాన కుట్రదారులనే ఆరోపణలు వచ్చాయి.
బొంబాయి (ఇప్పుడు ముంబై) మహీం కాజ్‌వేలోని ఫిషర్‌మెన్స్ కాలనీ, జవేరీ బజార్, ప్లాజా సినిమా, సెంచరీ బజార్, కథా బజార్, హోటల్ సీ రాక్, సహారా ఎయిర్‌పోర్టు, ఎయిర్ ఇండియా బిల్డింగ్, హోటల్ జుహూ సెంచ్యుర్, వర్లి, బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజీ బిల్డింగ్, పాస్‌పార్ట్ ఆఫీసుల వద్ద బాంబు పేలుళ్ల సంభవించాయి.

ముంబై బాంబు పేలుళ్లలో 28 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు కూడా ముంబై పేలుళ్ల మచ్చ అంటుకుంది. ఆయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై ఆయన అరెస్టయ్యాడు. ఈ కేసులో సంజయ్‌దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది.












Click it and Unblock the Notifications