ప్రజలకు పవర్ షాక్: చంద్రబాబు, విజయమ్మ ధర్నాలు

పెరిగిన విద్యుత్ చార్జీలు ఎల్లుండి(సోమవారం) నుంచి అమలులోకి వస్తాయి. వ్యవసాయ విద్యుత్‌లో ఈఆర్‌సీ ఎలాంటి మార్పు చేయలేదు. విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై రూ.6500 కోట్ల భారం పడనుంది. గృహ వినియోగదారులకు ఇది వరకు ఉన్న ఆరు స్లాబులను పది స్లాబులుగా మార్చింది. గతంలో వంద యూనిట్లకు ఒక స్లాబ్ ఉండేది. ఇప్పుడు యాభై యూనిట్లను ఒక స్లాబుగా మార్చేసి, విద్యుత్ చార్జీలను పెంచింది.
గృహాలకు 50 యూనిట్ల లోపు వాడే వినియోగదారులకు యూనిట్‌కు రూ.1.45 పైసలు చార్జీ విధిస్తారు. 51 నుంచి 100 యూనిట్ల లోపు వినియోగదారులకు రూ.2.60 పైసలు యూనిట్‌కు చెల్లించాల్సి ఉంటుంది. 101 - 150 యూనిట్ల లోపు వాడకందార్లు రూ. 3.25 పైసలు, 151 నుంచి 200 యూనిట్లు వాడేవారు యూనిట్‌కు రూ.4.88 పైసలు, 201 - 250 యూనిట్లు వాడేవారు రూ.5.63 పైసులు, 251 - 300 యూనిట్లు వాడేవారు యూనిట్‌కు రూ.6.38 పైసలు చెల్లించాల్సి ఉంటుంది.
ఆలాగే, 301 నుంచి 400 వరకు విద్యుత్తును వాడేవారు యూనిట్‌కు రూ. 7.38పైసలు, 401 - 500 యూనిట్ల వరకు వాడే వినియోగదారులు యూనిట్‌కు రూ.7.88 పైసలు, 500 యూనిట్లు పైబడి వాడే వినియోగదారులు యూనిట్‌కు రూ.8.38 పైసులు చెల్లించాల్సి ఉంటుంది.
పరిశ్రమలు యూనిట్‌కు రూ.6.88 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయానికి అందించే విద్యుత్ చార్జీల విషయంలో మార్పు లేదు. పెంచిన చార్జీల ద్వారా ప్రజలపై 6.500 కోట్ల రూపాయల మేరకు భారం పడనుంది.
పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ డిమాండ్ చేశారు. విద్యుత్తు చార్జీలపై, విద్యుత్ కోతలపై వైయస్ విజయమ్మ ఈ నెల 3వ తేదీన నల్లగొండలో దీక్ష చేపట్టనున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారంనాడు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ధర్నా చేస్తారు. అన్ని రాజకీయ పార్టీలు విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.
బిజెపి ఎమ్మెల్యేల దీక్ష
విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ముగ్గురు బిజెపి శానససభ్యులు హైదరాబాదులోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రిలే నిరాహార దీక్షకు దిగారు. జి. కిషన్ రెడ్డి, యెండల లక్ష్మినారాయణ, శ్రీనివాస రెడ్డి దీక్షలకు దిగారు. వారితో పాటు బిజెపి నాయకులు కూడా దీక్షకు దిగారు. ఈనాటి చార్జీల పెంపు వైయస్ రాజశేఖర రెడ్డి పాపమేనని తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.అవసరమైతే చార్జీల పెంపుపై ట్రిబ్యునల్‌కు వెళ్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications