కిరణ్ రెడ్డికి పవర్ షాక్: చిరంజీవి, బొత్స రివర్స్ గేర్
హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వపక్షం నుంచే వ్యతిరేకతను ఎదుర్కుంటున్నారు. ఎన్నికల వేళ పవర్ చార్జీలు పెంచితే పవర్‌కు దూరమవుతామంటూ ధ్వజమెత్తుతున్నారు. 2004 ఎన్నికలకు ముందు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ చార్జీల పెంపు వల్లనే అధికారం కోల్పోయారని గుర్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా పలువురు నాయకులు విద్యుత్తు చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నారు.
విద్యుత్ చార్జీల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి చిరంజీవి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌కు లేఖ రాశారు. విద్యుత్ సమస్య, చార్జీల పెంపు అంశంపై చర్చించేందుకు సత్వరమే 'సమన్వయ కమిటీ' సమావేశం ఏర్పాటు చేయాలని చిరంజీవి డిమాండ్ చేశారు. ఎన్నికల ఏడాదిలో ఇంత భారీ ఎత్తున చార్జీలు పెంచడం వల్ల తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని చిరంజీవి తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.

2004 ఎన్నికలకు ముందు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన తప్పునే ఇప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఆగ్రహంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని గుర్తు చేశారు. ఎన్నికల ఏడాదిలో విద్యుత్తు, భూములు, ఇళ్ల స్థలాలపై చార్జీలు పెంచడం సరికాదన్నారు. ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్తు చార్జీల పెంపుపై చర్చించాలంటూ ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి, బొత్సకు లేఖలు రాశారు.
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం పెట్టి మరీ పేదలపై చార్జీల భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ప్రకటించారు. చార్జీలు పెంచడం అనివార్యమే అయినా పేద, మధ్య తరగతిపై భారం లేకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యుత్తు చార్జీలను పెంచినా 50 యూనిట్ల వరకు వాడుకునే వారిపై ఎటువంటి భారం వేయని సంగతి తెలిసిందే. దీన్ని 100 యూనిట్ల వరకు పెంచాలని పిసిసి ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది.
పార్లమెంటు సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి వంటి ఒకరిద్దరు మినహా చార్జీలు పెంచితే పార్టీపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందని ఎక్కువ మంది నాయకులు అంటున్నారు. విద్యుత్తు చార్జీలు పెంచడం సబబేనని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు.
సొంత పార్టీ నుంచే ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పేదలపై భారం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈనెల నాలుగైదు తేదీల్లో ఈఆర్‌సీ నివేదికను సమీక్షించి, నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!