బెజవాడ కోసం కేశినేని వర్సెస్ గద్దె: హామీ ఎవరికి...?

మరోవైపు అదే టిక్కెట్ పైన ఆశ పెట్టుకున్న సీనియర్ నేత గద్దె రామ్మోహన రావు దీనిపై అలకబూనిన విషయం తెలిసిందే. తనకు విజయవాడ పార్లమెంటు లేదా గన్నవరం టిక్కెట్ ఇవ్వాలని ఆయన మంగళవారం చంద్రబాబును కలిసి కోరే అవకాశాలు ఉన్నాయట. గద్దె అలక వహించిన విషయం తెలిసిన బాబు తనను కలవాలని గద్దెను ఆదేశించారు. ప్రస్తుతం బాబు తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు.
బాబును కలిసేందుకు గద్దె సిద్ధమయ్యారు. ఆయన ఎంపీ టిక్కెట్ కోసమే రేపు పట్టుబట్టేందుకు సిద్ధమయ్యారట. ప్రస్తుతం కేశినేని నానిని నియోజకవర్గం ఇంఛార్జిగా నియమించినా తనకే టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరనున్నారట. అయితే, బాబు మాత్రం అందుకు సిద్ధంగా లేనట్లు, ఆయనను బుజ్జగించేందుకు పిలిపించుకుంటున్నట్లుగా సమాచారం. మరోవైపు ఇప్పటికే ఇంఛార్జిగా నియమించడంతో కేశినేని నాని విజయవాడలో ప్రతి నియోజకవర్గంలో కార్యాలయం ఏర్పాటు చేసి బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు.
చంద్రబాబును గద్దె కలిసిన అనంతరం తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయా? అనే అంశంపై నాని వర్గంలో చర్చ జరుగుతోందట. అయితే, గద్దెను బుజ్జగించి మరో నియోజకవర్గంపై ఒప్పించేందుకే బాబు పిలిపించి ఉంటారని చెబుతున్నారు. ఇప్పటికే గన్నవరం టిక్కెట్ పైన వల్లభనేని వంశీ, దాసరి బాలవర్దన రావుల మధ్య పోటా పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గద్దె, నానిల మధ్య విజయవాడ టిక్కెట్ పోరు బెడవాడ టిడిపిలో ఆసక్తికరంగా మారింది.
గద్దె రామ్మోహన రావు 1994లో గన్నవరం ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందారు. అదే టిక్కెట్ పైన హామీ ఇచ్చి చంద్రబాబు అతనిని పార్టీలోకి తీసుకు వచ్చినా సమీకరణాలు కుదరకపోవడం వల్ల 1999లో గన్నవరం కాకుండా విజయవాడ ఎంపీ టిక్కెట్ ఇచ్చారు.
2004లో గద్దె విజయవాడ ఎంపి టిక్కెట్ ఆశించినా చిరంజీవి ప్రచారం చేస్తారని చెప్పి దానిని నిర్మాత అశ్వనీదత్‌కు ఇచ్చారట. ద్దెను మాత్రం కంకిపాడుకు పంపించారు. 2009లో గద్దె మరోసారి ఎంపి టిక్కెట్ ఆశించినా అది వల్లభనేని వంశీకి ఇచ్చారు. గద్దెను విజయవాడ తూర్పుకు పంపించారు. అయితే, వరుసగా రెండుసార్లు ఎంపి టిక్కెట్ ఆశించి భంగపడిన గద్దె ఇప్పుడు ఆ టిక్కెట్ లేదా తాను కోరే అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ సాధించేందుకు బాబు వద్ద తేల్చుకునేందుకు సిద్ధమయ్యారట.












Click it and Unblock the Notifications