జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. షోకాజ్ నోటీసులు జారీ !!
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు.. ఫెడరేషన్ కి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయనపై తక్షణమే సహాయ నిరాకరణ విధిస్తున్నట్లు ప్రకటన చేసింది. దీంతో ఈ వ్యవహారం తెలుగు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాగా ఈ నెల 12న జానీ మాస్టర్ విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. అందులో తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సదరు వీడియోలో జానీ చేసిన వ్యాఖ్యలు.. సభ్యులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని.. ఫెడరేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా చేశారని ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే అంశంపై కూడా ఫెడరేషన్ సీరియస్ అయ్యింది.

జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఫెడరేషన్.. ఈ నెల 14న ఆయనను వివరణ కోసం ఆఫీస్ సమావేశానికి పిలిచింది. అయితే విచారణకు పిలిచినా ఆయన హాజరుకాకపోగా తన ఇష్టానుసారంగా మాట్లాడటం కొనసాగించారని సీరియస్ అయ్యింది. షోకాజ్ నోటీసు అందిన 7 రోజుల లోపు జానీ మాస్టర్ లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఫెడరేషన్ ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువు లోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోయినా.. బహిరంగ క్షమాపణలు చెప్పకపోయినా ఆయనపై మరిన్ని కఠిన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఇక ఫెడరేషన్ తీసుకున్న సహాయ నిరాకరణ నిర్ణయం కారణంగా.. ఇకపై సంస్థకు అనుబంధంగా ఉన్న అన్ని సంఘాలు, సభ్యులు, కార్మికులు జానీ మాస్టర్‌కు ఎలాంటి అధికారిక సహకారం అందించరు. అలానే ఆయనతో పాటు తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు కూడా ఈ నియమాలు వర్తించనున్నాయి. ఫెడరేషన్‌కు అనుబంధంగా ఉన్న 24 క్రాఫ్ట్ సంఘాలూ ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జరగబోయే ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications