బాలయ్యతో కోల్డ్‌వార్: జగన్‌కే జూ.ఎన్టీఆర్ మద్దతు!
హైదరాబాద్: నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నట్లుగానే కనిపిస్తోంది. బాబాయ్ - అబ్బాయ్‌ల మధ్య చాలా రోజుల కిందటే పొరపొచ్చలు వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీపై పట్టు కోసం సాగుతున్న ఆధిపత్య పోరు నేపథ్యంలో వీరి మధ్య పరోక్ష యుద్ధం ప్రారంభమైంది. ప్రస్తుతానికి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకే మద్దతిస్తున్న బాలయ్య భవిష్యత్తులో బావ నుండి పార్టీ బాధ్యతలు తీసుకొని 'ముఖ్య' పదవులను అధిష్టించడమో లేక తన అల్లుడు నారా లోకేష్ కోసం ప్రయత్నాలు చేయడమో చేస్తున్నారు.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా లోకేష్ చేతికి పగ్గాలు పోతే పార్టీ తన చేతుల్లోకి రావడం కుదరదని భావించి పార్టీలో పట్టుకోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో బాబాయ్ - అబ్బాయ్‌ల మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. అయితే, ఇన్నాళ్లు జూనియర్ తన మావయ్య, బాబాయ్‌ల పైన అసంతృప్తితోనే ఉన్నారనే ప్రచారం జరిగింది. కానీ, తాజాగ ఫ్లెక్సీ రాజకీయం ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది.

జూనియర్ ఎందుకు పెదవి విప్పడం లేదు?
టిడిపిలోని విభేదాలు వైరి పార్టీ వైయస్సార్ కాంగ్రెసు, అధికార కాంగ్రెసు పార్టీకి లబ్ధి చేకూరేలా చేస్తోందనే చెప్పవచ్చు. నిత్యం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తమ ఫ్లెక్సీలలో సీనియర్, జూనియర్ ఎన్టీఆర్‌ల ఫోటోలు పెట్టుకొని వివాదానికి తెరలేపుతున్నారు. తన ఫోటోను జగన్ పార్టీ ఉపయోగించుకోవడంపై జూనియర్ ఇప్పటి వరకు పెదవి విప్పక పోవడం తెలుగు తమ్ముళ్లలో అనేక అనుమానాలకు తావిస్తోంది.
అసంతృప్తితో ఉన్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత రాద్దాంతం చెలరేగుతున్నా జూనియర్ బయటకు వచ్చి వివరణ ఇవ్వక పోవడంతో ఆయన మనసులోని భావం అర్థమవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిత్యం తాతయ్య పేరు చెప్పే ఎన్టీఆర్... 2014 నాటికి ఆ తాత స్థాపించిన టిడిపి ఓటమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నట్లుగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకోసం అతను ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.
ఇంత రాద్దాంతం జరుగుతూ టిడిపికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ జూనియర్ బయటకు రావడం లేదంటే ఆయన టిడిపినే లక్ష్యంగా చేసుకుని ఉంటారంటున్నారు. అందుకే జగన్ పార్టీ తన ఫోటోలను వినియోగించుకున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసంతృప్తి, ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో ఇప్పటికే చాలా మందిలో జూనియర్ ఎన్టీఆర్.. భవిష్యత్తులో జగన్‌కే మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు సామాన్యుల్లోను వ్యక్తమవుతోందంటున్నారు. 2009 ఎన్నికల ప్రచారం సందర్భంలో రాజకీయ రుచి మరిగిన జూనియర్ పార్టీలో పట్టుకోసం విఫలయత్నం చేసి ఇప్పుడు పార్టీనే టార్గెట్‌గా పెట్టుకొని ఉండవచ్చునని చెబుతున్నారు.
మరోవైపు బాలయ్య కూడా జూనియర్ ఎన్టీఆర్‌తో మాట్లాడుతానని సామరస్యంగా చెబుతూనే హెచ్చరికలు జారీ చేశారు. జూనియర్ దీనిని ఖండించాలని లేదంటే పరిణామాలు తప్పవని బాలయ్య చెప్పారు. బాలయ్య వార్నింగ్‌ను జూనియర్ కూడా పట్టించుకున్నట్లుగా లేదు. విజయవాడలో బాబు పాదయాత్రలో జూనియర్ ఫోటోలు వద్దనడం, విజయవాడలో జూనియర్ కార్యక్రమానికి టిడిపిని దూరంగా ఉండమని బాలయ్య ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరగడం, తర్వాత ఎన్టీఆర్ 'దమ్ము' చూపించడం.. ఇలా బాలయ్య-జూనియర్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ చంద్రబాబుకు చుక్కలు చూపిస్తోందంటున్నారు.
జూనియర్ ఫోటోను జగన్ పార్టీ వినియోగించుకుంటే టిడిపికి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారట. అయితే, ఇలా సైలెంట్‌గా ఉంటూ ఎన్టీఆర్ ఫోటోను వినియోగించుకుంటే పార్టీకి నష్టమని, జూనియర్ పైన ఏదో ఒకటి తేల్చేస్తే పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని మరికొందరు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారట. జూనియర్ కూడా పదవి విప్పడం లేదని కాబట్టి తేల్చేస్తేనే మంచిదని చెబుతున్నారట. అయితే, తొందరపడవద్దని ముఖ్య నేతలు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications