వైయస్ ఆశించినట్లే జగన్ ఎ1గా ఎదిగారు: బాబు విసుర్లు

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎ1గా ఎదగాలని కోరుకున్నారని, ఆయన అనుకున్నట్లుగానే అన్నింటిలోను ఎ1గా ఎదుగుతున్నాడంటూ సిబిఐ ప్రతి ఛార్జీషీటులో జగన్ ఎ1 ఉండటాన్ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అవినీతి, అక్రమాలు, దోపిడీలలోనూ జగన్ ప్రథముడిగా ఉండాలనుకున్నారని, దొంగ కంపెనీల్లోనూ చలాయించుకు రావాలని ఆశించారని, అవన్నీ కలగలిసి ఇప్పుడు జగన్ నిజంగానే ఏ-1గా మిగిలారన్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వైయస్ రాష్ట్ర సంపదను దారుణంగా దోచుకున్నారని, జగన్‌కి లక్ష కోట్ల లబ్ధి చేకూర్చారని, ఈ పనిలో వైయస్‌కు సహకరించిన మంత్రులు, అధికారులంతా ఇప్పుడు చంచల్‌గూడ జైలుకెళ్లారన్నారు. జగన్‌కు అన్యాయం జరిగిందన్న ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వ్యాఖ్యల పైనా స్పందించారు. కొడుక్కి అందరూ అన్యాయం చేస్తున్నారని ఆ తల్లి గగ్గోలు పెడుతున్నారని, అసలు తన కొడుకు వల్ల ఎంతమంది ఐఏఎస్‌లు జైలుకెళ్లారో ఆమె తెలుసుకోవాలన్నారు.
దేవుడంటూ వైయస్‌కు విగ్రహాలు పెట్టేవారు.. ఆయన వల్ల ఎవరికి మేలు జరిగిందో చెప్పాలన్నారు. నిన్న అధికారులు, ఇప్పుడు మంత్రులు జైలు దారి పట్టడానికి గానీ, చివరకు తన కుమారుడు జైలుకెళ్లడానికి గానీ వైయస్సే కారణమని దుయ్యబట్టారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ నిండా నేరస్థులేనని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో పెట్టిన జగన్ పేపర్, టీవీలను చూడొద్దని విజ్ఞప్తి చేశారు. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు ధర్మంగా గెలిచారని, టిడిపి కూడా తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అక్రమాలపై విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications