జైళ్లోనే జగన్ సర్దుబాటు!: తెలంగాణపై పట్టుకు యత్నం

ఆయా నియోజకవర్గాల్లో, ఆయా జిల్లాల్లో తలెత్తిన విభేదాలను ఆయన జైళ్లో ఉంటూనే పరిష్కరిస్తున్నారట. కారాగారమే జగన్‌కు క్యాంపు కార్యాలయంగా మారుతోందని ప్రధాన ప్రతిపక్షం విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో నియోజకవర్గాల ఇన్‌చార్జిల నియామకంపై నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు జైలు నుంచే జగన్ రంగంలోకి దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆ మూడు జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు పువ్వాడ అజయ్, కొండా మురళి, బాజిరెడ్డి గోవర్ధన్‌లకు జైలు నుంచి పిలుపు కూడా అందిందట. వీరు ఈ రోజు(శుక్రవారం) జైలుకెళ్లి జగన్‌ను కలువనున్నారట. ఇటీవల నియోజకవర్గాల వారీగా పార్టీ చేపట్టిన సమన్వయకర్తల నియామకంతో పార్టీలో చిచ్చు రగిలిన విషయం తెలిసిందే. బాజిరెడ్డి డబ్బులకు పదవులు అమ్ముకున్నారంటూ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ వెంకట రమణా రెడ్డి తన రాజీనామా లేఖను అధిష్ఠానానికి ఇచ్చారు.
దీనిపై మాట్లాడేందుకే జైలుకు రావాలంటూ బాజిరెడ్డికి పిలుపు అందిందంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో వెంకట రమణా రెడ్డికి కూడా పిలుపు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తల నియామకాలు పెండింగ్‌లో ఉన్న రెండు జిల్లాల్లో ఖమ్మం ఒకటి. అక్కడ జలగం వెంకట్రావు, పువ్వాడ అజయ్ కుమార్ వర్గాల మధ్య విభేదాల కారణంగా సమన్వయకర్తల నియామకంలో జాప్యం జరుగుతోంది.
ఇటీవల పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తనకు అనుకూలంగా ఉన్న వారిని సమన్వయకర్తలుగా నియమించుకోవాలని చూస్తుండటంతో సమస్య మరింత జటిలంగా మారింది. అంతేకాక నియోజకవర్గాన్ని ఎంచుకునే విషయంలోనూ అజయ్‌కు స్పష్టత లేదనే అభిప్రాయం ఉందట. తొలుత ఖమ్మం తర్వాత పాలేరు కావాలని అజయ్ చెప్పారట. తాజాగా ఆయనకు మరోనేత నరేష్ రెడ్డికి కలిపి పాలేరు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
దీనికి తోడు జలగం వెంకట్రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో ఉన్న విభేదాల కారణంగా అజయ్ ఒక దశలో పార్టీకి, పదవికి రాజీనామా చేయటానికి సిద్ధపడ్డారట. పార్టీ నాయకత్వమే ఆయనను పార్టీ జిల్లా కన్వీనర్ బాధ్యతల నుంచి తప్పించాలని చూస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. ఈ క్రమంలోనే అజయ్‌కి జగన్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలోని ఇదే పరిస్థితి. ఎన్నికల సమయానికే ఇక్కడ సమన్వయకర్తలను నియమించాలని కొండా దంపతులు పట్టుపడుతున్నారు.
పార్టీ చేస్తున్న సర్వేలకు, వారి ప్రతిపాదనలకు పొంతన కుదరటం లేదట. ఉదాహరణకు మహబూబాబాద్‌లో కొండా మురళి ఒక పేరు సూచిస్తుంటే, పార్టీ సర్వేలో మరొకరి పేరు వచ్చింది. ఈ పరిస్థితుల్లోనే ఆయనకు కూడా జైలులో ఉన్న జగన్ నుంచి పిలుపు వచ్చిందట. సీమాంధ్రలో బలంగా ఉందని, ఇక తెలంగాణపై దృష్టి సారించాలని జగన్ గట్టిగా భావిస్తున్నారట. ఇందు కోసం తెలంగాణ ప్రాంతంలో భారీగా కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారట. ఓ వైపు విభేదాలపై దృష్టి సారిస్తూనే పార్టీ కార్యక్రమాలను కొనసాగించనున్నారట. త్వరలో షర్మిల యాత్ర ఖమ్మంలోకి ప్రవేశించనుంది. నాటికి మొత్తం క్లియర్ చేయాలని జగన్ చూస్తున్నారట.












Click it and Unblock the Notifications