అందరూ అందరే!: విపక్షాలపై విరుచుకుపడ్డ కిరణ్

అనంతపురం జిల్లా మడకశిరలో ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. విద్యుత్ చార్జీల అంశంపై వివరణ ఇచ్చారు. ప్రజలు యూనిట్‌కు రూ.1.45 చెల్లిస్తే ప్రభుత్వం అదనంగా రూ. 3.80 జమ చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 యూనిట్లలోపు వాడే వారే 1.86 కోట్ల మంది ఉన్నారని వీరిలో ఏ ఒక్క కుటుంబానికీ భారం మోపలేదని వెల్లడించారు.
దళితులు, గిరిజనుల కోసం బడ్జెట్లో విడుదల చేసే నిధులు పక్కదారి పట్టకుండా చట్టం చేయాలని మూడు దశాబ్దాల కిందే నాటి ప్రధాని ఇందిర భావించారని ఆమె ఆశయాలకు అనుగుణంగానే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికను అమలుచేశామని ముఖ్యమంత్రి చెప్పారు. దళితుల సంక్షేమానికి చట్టబద్ధత కల్పించడానికి అన్ని పార్టీలూ మద్దతిస్తాయని ఆశించినా కాంగ్రెసేతర పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు.
నిత్యం పేదల కోసం పోరాడుతున్నామనే వామపక్షాలతో పాటు ప్రతిపక్ష టిడిపి, బిజెపి, తెరాస, వైయస్సార్ కాంగ్రెసులు కూడా వ్యతిరేకించటం ఆందోళన కలిగించిందన్నారు. 1.80 కోట్ల మంది దళితులు బాగుపడే కంటే వాకింగ్ ఫ్రెండ్ చంద్రబాబుకు పాదయాత్రే ముఖ్యమైందని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications