జూ ఎన్టీఆర్ ఛీ అన్నా!: ఫ్లెక్సీలపై తీరుమారని జగన్ పార్టీ

తాజాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని తుమ్మలపాలెం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఓ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కార్యకర్తలు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు హీరో జూనియర్ ఎన్టీఆర్, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటోలను కూడా పొందుపర్చారు.
కృష్ణా జిల్లాలో జగన్ పార్టీ ఫ్లెక్సీలలో జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలు పెట్టుకోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లాలోనే కాకుండా విశాఖపట్నం, ఖమ్మం, కరీంనగర్, చిత్తూరు తదితర జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టిడిపి నేతల ఫోటోలను పెట్టుకుంది.
దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. తనకు సంబంధం లేని విషయాల్లోకి తనను లాగవద్దని ఓ సందర్భంలో చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన బొమ్మతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను కలిసిన సమయంలో ఆయన ఆ విషయంపై మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ అధినాయకత్వం కోరితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ చెప్పారట. తద్వారా జగన్ పార్టీ తన ఫోటోను వినియోగించుకోవడాన్ని ఆయన తప్పు పట్టినట్లుగా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications