వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు రిపేర్: కిరణ్, బొత్స భేటీల మీద భేటీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa - Kiran
న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీని మరమ్మతు చేయడానికి పార్టీ అధిష్టానం కట్టుబడి ఉన్నట్లే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీల మీద భేటీలు జరిపారు. కళంకిత మంత్రుల వ్యవహారం, పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యుల వలసలు, పార్టీ పునర్వ్యస్థీకరణ, మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ వంటి అంశాలపై వారిద్దరు కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు రేపు గురువారం కూడా కొనసాగే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో అర గంటపాటు సమావేశమయ్యారు. బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. ఆజాద్‌తో రెండు విడతలుగా సమావేశమయ్యారు. రేపు గురువారం బొత్స సత్యనారాయణ, కిరణ్ కుమార్ రెడ్డి ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీకి అందించడానికి గులాం నబీ ఆజాద్ ఓ నివేదికను తయారు చేస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితులుగా చార్జిషీట్లలో పేర్లు నమోదైన ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రారెడ్డి వ్యవహారాలపై ఏం చేయాలనే అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వారిద్దరినీ అలాగే కొనసాగనిస్తే తర్వాత మిగతా మంత్రుల విషయంలో అదే వైఖరిని అనుసరించాల్సిన పరిస్థితి వస్తుంది. జె. గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణ పేర్లను కూడా సిబిఐ తదుపరి చార్జిషీట్లలో నిందితులుగా చేర్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ప్రస్తుతం నిందితులుగా ఉన్న మంత్రులను తొలగించడమా, వారి శాఖలను మార్చడమా అనే విషయాన్ని కాంగ్రెసు అధిష్టానం తేల్చుకోలేకపోతోంది. వారితో పాటు మిగతా ముగ్గురిని కూడా తొలగిస్తూ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిపితే ఎలా ఉంటుందనే విషయంపై కూడా మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. దానివల్ల ప్రభుత్వానికి వాటిల్లే ముప్పు గురించి కూడా ఓ అంచనాకు వచ్చే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. అయితే, కళంకిత మంత్రుల విషయంలో ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం మంచిదనే అభిప్రాయం కూడా కాంగ్రెసు అధిష్టానం పెద్దల నుంచి వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికలలోపు తనదంటూ ఓ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉన్న ప్రస్తుత తరుణంలో పార్టీని నడిపించడానికి తనకు విధేయులైనవారిని మంత్రివర్గంలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, దీనికి సోనియా గాంధీ ఏ మేరకు అంగీకరిస్తారనేది అనుమానంగానే ఉంది. ఏ విషయాన్నీ ఓ పట్టాన తేల్చని సోనియా గాంధీ ఈ విషయాన్ని అంత త్వరగా తేలుస్తారని అనుకోవడానికి వీలు లేకుండాపోయింది.

కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇచ్చిన ఆఫర్‌తో పార్టీని వదిలేయడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఆరుగురు ఎంపీలు పార్టీని వదిలేసే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనేది కూడా పార్టీ అధిష్టానానికి తలనొప్పిగానే ఉంది. అయితే, వారు వెళ్లిపోయినా ఫరవా లేదనే భావనతో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. ఆ పార్లమెంటు సభ్యులను ఢిల్లీకి పిలిపించి మాట్లాడుతారా, లేదా అనేది సందేహంగానే ఉంది.

పార్టీని కూడా పునర్వ్యస్థీకరించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బొత్స సత్యనారాయణ పార్టీ పదవినో, మంత్రి పదవినో వదులుకోవాల్సి రావచ్చునని తెలుస్తోంది. పార్టీ పునర్వ్యస్థీకరణలో భాగంగా కళంకిత మంత్రులతో పాటు కొంత మంది సీనియర్ మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించి, పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా సాగుతుందని అంటున్నారు.

అలా చేస్తే కేవలం కళంకిత మంత్రులను మాత్రమే తొలగించారనే భావన కలగకుండా ఉండడంతో పాటు ముఖ్యమంత్రికి తనదైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. తెలంగాణ అంశాన్ని మాత్రం కాంగ్రెసు పార్టీ అటక ఎక్కించినట్లేనని భావిస్తున్నారు. తెలంగాణ అంశాన్ని తేల్చకుండా తెలంగాణలో ఎలా పాగా వేయాలనే విషయంపై ఆలోచన సాగుతున్నట్లు చెబుతున్నారు.

English summary
Congress high command is in a bid to repair party in Andhra Pradesh. As a part of it CM Kiran kumar Reddy and PCC Botsa Satyanarayana are meeting high command leaders like Ghulam Nabi Azad. Kiran reddy met Sonia Gandhi today. Botsa and Kiran may meet Rahul Gandhi on thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X