చల్లని కబురు, రాష్ట్రంలోకి రుతుపవనాలు - ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!
వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇప్పటి వరకు భానుడి భగభగలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు ఇక రిలీఫ్ దక్కనుంది. అత్యధిక వర్షపాతాన్ని అందించే నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళను తాకి ముందుకు కదులుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఇవి రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. ఇదే సమయంలో ద్రోణి కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు చురుగ్గా కదులు తున్నాయి. కేరళను తాకిన రుతుపవనాలు శనివారం నుండి సోమవారం మధ్య ఇవి ఆంధ్ర ప్రదేశ్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణ షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీనే కేరళకు చేరుకోవాల్సిన రుతుపవనాలు, ఈసారి మూడు రోజుల ఆలస్యంగా పలకరించాయి. ఇప్పటికే కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు, గోవాలోని పలు ప్రాంతాలకు ఇవి విస్తరించడంతో అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 6 నుంచి 8వ తేదీల మధ్య ఈ రుతుపవనాలు రాయలసీమ గుండా ఏపీలోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది. ఒకవేళ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఏవైనా మార్పులు వస్తే, రుతుపవనాల రాక మరో వారం రోజుల పాటు ఆలస్యమయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.

రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు
అయితే, ఈ నెల 10వ తేదీ నాటికి ఇవి ఖచ్చితంగా రాష్ట్రాన్ని తాకుతాయని, జూన్ 15 నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్తిగా విస్తరిస్తా యని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గి, ఉష్ణోగ్రతలు అదుపులోకి రానున్నాయి. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. రాబోయే ఐదు రోజుల్లో ఎండల తీవ్రత పెరిగే అవకాశం లేదు. అయితే, ప్రస్తుతం దక్షిణ కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వైపు ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.













Click it and Unblock the Notifications