మోదీ కేబినెట్ లో టీడీపీకి మరో బెర్తు, వారు ఔట్ - చంద్రబాబు ఛాయిస్..!!
ప్రధాని మోదీ తన మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్దమయ్యారు. మూడో సారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న మోదీ.. ఈ నెల 10న ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ భేటీ లో మిషన్ 2029 లక్ష్యంగా మిత్రపక్షాలకు కీలక దిశా నిర్దేశం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నుంచి కేంద్ర కేబినెట్ లో మార్పులు జరగనున్నాయి. టీడీపీకి మరో మంత్రి పదవి దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. పలువురి శాఖల మార్పు జరగనుంది. అదే సమయంలో కొందరు సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు ప్రధాని కసరత్తు చేస్తున్నారు.
ప్రధాని మోదీ తన కేబినెట్ ప్రక్షాళనకు సిద్దమయ్యారు. 2014 నుంచి మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరిని, 2019 నుంచి మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరిని పక్కకు తప్పిస్తారని తెలిసింది. 60 శాతానికిపైగా మంత్రుల శాఖలు మారవచ్చని సమాచారం. విద్యుత్ మంత్రి మనోహర్ ఖట్టర్, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌లను గవర్నర్లుగా నియమించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరగనున్నాయి. రామ్మోహన్ శాఖ మార్పు ఉంటుందని సమాచారం. పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రమోషన్ దక్కుతుందని పార్టీ నేతల సమాచారం. తెలంగాణ నుంచి మరో బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రిగా అవకాశం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక.. ఏపీ నుంచి టీడీపీ - జనసేన పార్టీలకు మరో మంత్రి పదవి ఇచ్చేలా బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

ఏపీ నుంచి ఛాన్స్ దక్కేదెవరికి
ప్రస్తుతం ఏపీ సమీకరణాల్లో భాగంగా టీడీపీకే మరో మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ లో టీడీపీ నుంచి ఇద్దరు.. బీజేపీ నుంచి ఒకరు మంత్రులు గా ఉన్నారు. బీజేపీ నుంచి మరొకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తే పురందేశ్వరికి ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. టీడీపీకి అవకాశం ఇస్తే చంద్రబాబు ఛాయిస్ ఎవరనేది ఆసక్తిగా మారుతోంది. ఏపీ లో సామాజిక - ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా మంత్రి పదవికి ఖరారు చేసే అవకాశం ఉంది. అందులో భాగంగా ఈ సారి ఎస్సీ వర్గానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. చిత్తూరు లేదా అమలాపురం ఎంపీల్లో ఒకరికి ఛాన్స్ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. అయితే... ప్రధాని మోదీ ఏపీ కేంద్రంగా తీసుకునే నిర్ణయాల ఆధారంగా.. చంద్రబాబు తన నిర్ణయం వెల్లడించే ఛాన్స్ ఉంటుంది. ఈ నెల 10న ఢిల్లీలో జరిగే భేటీ తరువాత మంత్రివర్గంలో ఏపీ నుంచి మార్పులు - చేర్పుల పైన స్పష్టత రానుంది.













Click it and Unblock the Notifications