ఆయనను కేంద్రమంత్రిగా తొలగించాలని డిమాండ్ చెయ్యండి.. లోకేష్ కు బీఆర్ఎస్ సూచన
తాజాగా బండి భగీరథ్ పోక్సో కేసు పై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల పైన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఏపీ మాజీ మంత్రి వైసిపి నేత సీదిరి అప్పలరాజు కుమారుడు రోడ్డు ప్రమాదం కేసు పైన స్పందిస్తున్న క్రమంలో ప్రమాదం తర్వాత భయంతో ఇంటికి వచ్చిన కుమారుడిని పోలీసులకు అప్పగించడం తల్లిదండ్రులకు కనీస బాధ్యత అని లోకేష్ వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా వేదికగా లోకేష్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోస్ట్
ఈ సందర్భంలో తెలంగాణలో నమోదైన బండి భగీరథ పోక్సో కేసును ఉదాహరణగా ప్రస్తావించి, తన కుమారుడిపై ఆరోపణలు రాగానే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని స్వయంగా పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యల పైన మండిపడిన బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

బండి భగీరధ్ కేసులో తండ్రి గారికి తెలీకుండానే జరిగాయా
బండి భగీరథ పోక్సో కేసు విషయంలో దయచేసి పూర్తిగా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని మనవి చేశారు. మీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉండే ఉంటారు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ బిడ్డ మీద సంవత్సరం పాట వేధింపులు, అత్యాచార యత్నాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయని, అవన్నీ తండ్రిగారికి తెలియకుండానే జరిగాయా అంటూ ఆయన ప్రశ్నించారు.
హనీ ట్రాప్ కేసు పెట్టి, మూకుమ్మడి దాడి చేశారని వ్యాఖ్యలు
2023 లో బండి సంజయ్ కుమారుడు తోటి విద్యార్థులను చితక బాదితే తండ్రి కొడుకుని వెనకేసుకొచ్చారు అని వెల్లడించారు. ఆ తల్లిదండ్రులను బిడ్డను అన్ని రకాలుగా బెదిరించి, హనీ ట్రాప్ కేసు పెట్టిన వారు బెదరరు అని తెలిసిన తర్వాత న్యాయస్థానాలలో ఆ బిడ్డ వయసు మీద నాన్న రాద్ధాంతం చేశారని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆ బిడ్డ క్యారెక్టర్ మీద మూకుమ్మడి దాడి జరిగిందని గుర్తు చేశారు.
సరెండర్ చేసింది అప్పుడే
తొమ్మిది రోజులపాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆడబిడ్డల అలుపెరుగని పోరాటం తర్వాత లొంగుబాటు జరిగిందని గుర్తు చేశారు. తన ప్రాణ మిత్రుడు రేవంత్ రెడ్డి ఇక మీ వాడిని దాచటం నావల్ల కాదని చేతులెత్తేసిన తర్వాత, దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగిన తర్వాత, బెయిల్ దొరకదని తెలిసిన తర్వాత అప్పుడు సరెండర్ చేశారని పేర్కొన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరిక జారీ చేయండని సూచన
మీకేమైనా వారు బాగా పరిచయం ఉంటే దయచేసి ఆయనను కూడా పోలీసులకు సరెండర్ కమ్మని చెప్పండి. ఎందుకంటే ఆ బిడ్డ వాగ్మూలం లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి పేరు కూడా చెప్పడం జరిగిందని ఆయన అన్నారు. నిజంగా మీకు మహిళల మీద గౌరవం ప్రేమ ఉంటే పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ గారిని కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయకపోతే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరిక జారీ చేయండి అంటూ లోకేష్ కు సూచనలు చేశారు. నాన్న చంద్రబాబు నాయుడు గారిని అడిగినట్లు చెప్పండి అంటూ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications