250 ఏళ్ల పండుగ వేళ.. ట్రంప్ బొమ్మతో బంగారు నాణెం!
అమెరికా చరిత్రలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. యూఎస్ 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖచిత్రంతో కూడిన సరికొత్త 1 డాలర్ బంగారు నాణేన్ని విడుదల చేయనున్నట్లు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అమెరికా అధికారిక కరెన్సీ తయారీ సంస్థ అయిన 'యూఎస్ మింట్' త్వరలోనే ఈ ప్రత్యేక బంగారు నాణేల ముద్రణను ప్రారంభించనుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు, దేశభక్తికి ప్రతీకగా ఈ స్మారక నాణేన్ని తీసుకువస్తున్నట్లు బెస్సెంట్ వెల్లడించారు.

ఈ ప్రతిష్టాత్మక నిర్ణయంపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "అమెరికా 250 వసంతాల స్వాతంత్య్ర సంబరాలను జరుపుకుంటున్న వేళ, దేశ సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించేలా ఈ ఒక డాలర్ బంగారు నాణేన్ని ముద్రించబోతున్నాం. అధ్యక్షుడు ట్రంప్ చిత్రంతో రాబోతున్న ఈ కాయిన్ అమెరికా విలువల బలాన్ని, పౌరులందరికీ స్వేచ్ఛను అందించే దేశ సంకల్పాన్ని చాటిచెప్తుంది" అని రాసుకొచ్చారు.
1776లో అమెరికా స్వాతంత్య్ర ప్రకటనపై సంతకాలు జరిగిన నాటి నుంచి 2026 నాటికి 250 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ ప్రత్యేక కాయిన్ ఐడియాను తెరపైకి తెచ్చారు.
అయితే, ఈ బంగారు నాణేనికి సంబంధించిన పూర్తి డిజైన్ ఎలా ఉండబోతోంది? మొత్తం ఎన్ని నాణేలను ముద్రిస్తారు? ఇవి సాధారణ ప్రజలకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి? అనే వివరాలను మాత్రం ప్రభుత్వం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.












Click it and Unblock the Notifications