వారి ఖాతాల్లోకి 25 వేలు..డేట్ ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు తీపి కబురు చెప్పింది. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7వ తేదీన నేతన్న భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును చేనేత జౌళి శాఖ పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని రంగాల వారిని ఆదుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేస్తుంది.
చేనేతలకు ఏపీ ప్రభుత్వం నేతన్న భరోసా
వారికి ఆర్థిక భరోసా కల్పించడానికి, వివిధ వృత్తులకు ప్రోత్సాహం ఇస్తుంది. ఈ క్రమంలోనే చేనేతలకు కూడా ఏపీ ప్రభుత్వం నేతన్న భరోసా పథకాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54 వేల మంది అర్హులకు నేతన్న భరోసా పథకాన్ని అందించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ పథకం కింద చేనేత కార్మికులకు సంవత్సరానికి 25 వేల రూపాయలు చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంవత్సరానికి 25 వేలు నేతన్న భరోసా
గత వైసిపి సర్కార్ హయాంలో ఈ పథకం కింద 24వేల రూపాయలు ఇవ్వగా, గత ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా కలిపి, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మాట ఇవ్వనప్పటికీ కూడా ఏపీ సర్కార్ చేనేతలకు అండగా నిలుస్తోంది.చేనేత కార్మికులను ఉద్దేశించి గతంలో మాట్లాడిన చంద్రబాబు వారికి అండగా నిలుస్తామని గత ప్రభుత్వం కంటే అదనంగా వెయ్యి రూపాయలు కలిపి సంవత్సరానికి 25వేలు చొప్పున ఆర్థికసహాయం అందిస్తామని పేర్కొన్నారు.
నేతన్న భరోసా కోసం బడ్జెట్లో 250 కోట్లు
ఈ పథకం అమలుకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం బడ్జెట్లో 250 కోట్లు కేటాయించింది. త్వరలో దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా విడుదల చేయనుంది. సొంత మగ్గం ఉండే చేనేత కార్మికులకు కుటుంబానికి ఒకరికి చొప్పున ఈ పథకాన్ని అందించాలని, ఆర్థిక సహాయం చేయాలని అధికారులు భావిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో అనుబంధ రంగాల కార్మికులకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు.
మరో 10 వేల మంది అనుబంధ కార్మికులకు పథకం వర్తింపు
కానీ ప్రస్తుతం చంద్రబాబు హయాంలో మరో 10 వేల మంది అనుబంధంగా కార్మికులకు కూడా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. చేనేతకు అనుబంధంగా ఉండే రాట్నం వడకటం, రంగులు అద్దడం తదితర రంగాల వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అంగీకారం కోసం ఫైల్ పెట్టారు. దీనిపైన సర్కార్ నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు నేతన్న భరోసా అందనుంది.












Click it and Unblock the Notifications