జగన్‌కు మనవాళ్ల చేయూత: ఆజాద్‌తో టి - ఎంపిలు

జగన్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు నాయకులు ప్రోత్సహిస్తున్నారని, కాంగ్రెసు నాయకులే జగన్‌కు మద్దతు ఇస్తున్నారని ఆజాద్‌తో చెప్పినట్లు సమావేశానంతరం పార్లమెంటు సభ్యుడు రాజయ్య మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ అంశం ముగిసిపోలేదని, తర్వాత మాట్లాడుదామని ఆజాద్ అన్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణపై స్పష్టమైన వైఖరి తీసుకోకపోతే తెలంగాణ ప్రాంతంలో పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆజాద్‌తో చెప్పినట్లు మరో పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ చెప్పారు. తెలంగాణ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామని, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చారని, కనీస ఉమ్మడి ప్రణాళికలో ప్రస్తావించామని, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, ఈ స్థితిలో తెలంగాణపై ఆలస్యం చేయడం తగదని తాము ఆజాద్‌కు వివరించినట్లు ఆయన చెప్పారు.
తెలంగాణపై రాహుల్ గాంధీకి ఇది వరకే చెప్పామని, మరోసారి చెప్తామని ఆయన అన్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఆజాద్ పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీతో జరిగే సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై, చెప్పాల్సిన అంశాలపై ఆజాద్‌తో పార్లమెంటు సభ్యులు చర్చించారు.
కిరణ్ రెడ్డిపై ఫిర్యాదు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరుపై రాష్ట్ర పార్లమెంటు సభ్యులు ఆజాద్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత ఇమేజ్‌ను పెంచుకోవడానికి ఒంటెత్తు పోకడలకు దిగుతున్నారని వారు ఆజాద్‌తో చెప్పారు. కిరణ్ ఎవరినీ కలుపుకుని పోవడం లేదని వి. హనుమంతరావు, వివేక్ తదితర ఎంపీలు ఫిర్యాదు చేశారు. మంత్రులకు లేఖలు రాస్తే సమాధానం రావడం లేదని సాయిప్రతాప్ చెప్పారు.
కావూరి ప్రసంగాన్ని అడ్డుకున్న టి-ఎంపీలు
ఆజాద్‌తో జరిగిన సమావేశంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ సమయంలో తెలంగాణ, సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. తెలంగాణ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ ఎంపీలకు సూచించారు. అఖిల పక్షం తర్వాత తెలంగాణను తామే అడ్డుకున్నామని సీమాంధ్ర ఎంపీలు చెప్పడం ఏ మేరకు సమంజసమని తెలంగాణ ఎంపీలు అడిగారు. పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆజాద్ పార్లమెంటు సభ్యులతో చెప్పారు












Click it and Unblock the Notifications