దారుణం: 'అప్పు తీరుస్తావా, భార్యను పంపిస్తావా?'

వివరాలు ఇలా ఉన్నాయి - తెనాలి ఇస్లాంపేటకు చెందిన మండా రమేష్‌బాబు (46) బంగారు నగల తాకట్టు వ్యాపారం చేస్తుండేవారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతరులు తనవద్ద తాకట్టు పెట్టిననగలను రమేష్‌బాబు ఫెడ్ బ్యాంకులో తాకట్టు పెట్టేవారు. కొంత కాలం వ్యాపారం బాగానే సాగింది. కానీ, కాలక్రమంలో ఆయన అప్పులపాలయ్యారు. బ్యాంకుకు సకాలంలో వడ్డీలు, అసలు కట్టనందున వారు నగలను వేలం వేశారు. ఇటు ఖాతాదారుల ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఆయన వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు.
అందులో భాగంగా, పట్టణానికే చెందిన వడ్డీ వ్యాపారి రాజా, తన వద్ద తీసుకున్న రూ.1.80 లక్షల బాకీ తీర్చాల్సిందిగా రమేష్ బాబుపై కొంతకాలంగా ఒత్తిడి తీసుకువస్తున్నాడు. అప్పు తీర్చలేడని గ్రహించి భార్యను పంపించాలని కోరాడు. ఖాతాదారుల ఒత్తిడి, రాజా వ్యాఖ్యలతో మనస్తాపానికి గురై రమేష్ బాబు తన భార్య పద్మావతి (36)తో కలిసి సోమవారం విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
చనిపోయేముందు రాజా వ్యాఖ్యల గురించి, తన కష్టాల గురించి చెబుతూ ఐదు పేజీల సూసైడ్ నోట్ రాశారు. నిజానికి వారు తమ కూతుళ్లతో సహా ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. అయితే, విషం కలిపిన కూల్‌డ్రింక్‌ను కూతుళ్లకు ఇవ్వగా వారు తాగడానికి నిరాకరించారు. దీంతో వారిద్దరిని ఆడుకోవడానికి బయటకు పంపి భార్యాభర్తలిద్దరూ తనువు చాలించారు. తమ అంత్యక్రియలను సోదరుడు హరిబాబు నిర్వహించాలని సూసైడ్ నోట్‌లో కోరారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు.












Click it and Unblock the Notifications