మరోవైపు: ఎన్టీఆర్‌కు ఈర్ష్యాద్వేషాలుండేవా? (ఫోటోలు)
హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీ రామారావు అంటే గంభీరమైన వ్యక్తిత్వం కళ్ల ముందు కదులాడుతుంది. ఆయన గంభీరమైన వర్చస్సు చూసి చాలా మంది మాట్లాడడానికి కూడా భయపడేవారు. దూరంగా నించుని ఆయన చూపుల కోసం ఎదురు చూసేవారు. 1984 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తర్వాత ఆయన రాజకీయ జీవితం చాలా ఒడిదొడుకులతోనే సాగిందని చెప్పాలి. 1989 శానససభ ఎన్నికల్లో ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి శానససభా నియోజకవర్గం నుంచి ఓడిపోవడం పెద్ద దెబ్బ.
అయితే, ఎన్టీ రామారావుకు ఈర్ష్యాద్వేషాలుంటాయా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. దగ్గరి నుంచి చూసినవారికి తప్ప ఆ విషయాలు ఎవరికీ తెలియవు. 1989 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. బహుశా ఆయన ఇది ఊహించి ఉండరు. అప్పుడు నేను ఉదయం దినపత్రికలో రాజకీయ వార్తలు రాసే ప్రతినిధిగా తెలుగుదేశం వ్యవహారాలు చూస్తున్న కాలం. ప్రతిపక్షంలో ఉన్న పార్టీపై వార్తలు రాయడం కష్టమే. పెద్దగా రాయడానికి ఏమీ ఉండవు. కానీ, నేను అదే పనిగా రాస్తూ ఉండేవాడిని. ఒక రకంగా తెలుగుదేశం పార్టీలోని లోపాలను ఎత్తి చూపే వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండేవాడిని. పత్రిక పాలసీ కూడా అదే.
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాల్లో నటించడం మానేశారు. అయితే, మోహన్ బాబు పట్టుబట్టి ఎన్టీ రామారావుతో మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించడానికి ఒప్పించారు. ఈ విషయం తొలుత నాకు తెలుగుదేశం నాయకుల ద్వారా తెలిసింది. దాంతో నేను ఎన్టీఆర్ ఆ సినిమాలో నటిస్తున్న విషయాన్ని వార్తాకథనంగా రాశాను. అదే సమయంలో ఎన్టీ రామారావు మద్యనిషేధ ఉద్యమాన్ని పెద్ద యెత్తున ముందుకు తీసుకుని వచ్చారు.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సమయంలో ప్రధాని మన్మోహాన్ సింగ్ తో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ములాయం సింగ్ యాదవ్.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన నందమూరి కుటుంబ సభ్యులు వరుసగా హారికృష్ణ, కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్, పురంధరేశ్వరి.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో అన్నగారికి నమస్కారం పెడుతున్న వెంకయ్య నాయుడు. రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీని కూడా చిత్రంలో చూడొచ్చు.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, హారికృష్ణలతో మిగతా పార్టీ పార్లమెంట్ సభ్యులు.
మద్య నిషేధంపై ఎన్టీ రామారావు మీద కాంగ్రెసు నాయకులు విమర్శలు చేస్తూ ఆయన కుమారుడు హరికృష్ణ ఆహ్వానం హోటల్లో బార్ కోసం దరఖాస్తు చేసుకున్నారని విమర్సించారు. దాన్ని ఎన్టీ రామారావు కాదన్నాడు. అయితే, నాకో అవకాశం దొరికనట్లయింది. హరికృష్ణ బార్‌కు చేసుకున్న దరఖాస్తు జీరాక్స్ ప్రతిని అచ్చేస్తూ వార్తాకథనం రాశాను.
అదే సమయంలో ఆయన హైదరాబాదు నుంచి విశాఖపట్నం వరకు రైలులో మద్య నిషేధ యాత్రను తలపెట్టారు. రైలులో వెళ్తూ ఆయన మధ్య మధ్యలో మద్యనిషేధంపై ప్రసంగాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దాన్ని కూడా నేను మరో విధంగా మల్చాల్సి వచ్చింది. తన విశ్వామిత్ర సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను అరకులోయలో చిత్రీకరించడానికి వెళ్తున్నారని, పనిలో పనిగా మద్య నిషేధ యాత్ర చేస్తున్నారని వార్త రాశాను. అది పతాక శీర్షిక కింద అచ్చయింది. ఇలా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాసే పనిలో పడి చివరకు ఎన్టీ రామారావు ఇంటర్య్యూకు సమయం తీసుకున్నాను.
తెల్లవారు జామునే నేనూ, అప్పుడు మాకు బ్యూరో చీఫ్‌గా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి ఎన్టీ రామారావు నివాసానికి వెళ్లాం. మేం వెళ్లేసరికే ఎన్టీ రామారావు అన్ని పనులూ పూర్తి చేసుకుని కుర్చీలో నిండుగా కూర్చున్నారు. మేం ఎదురుగా కూర్చోగానే ఎన్టీ రామారావు నుంచి అనూహ్యమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. నా వార్తలను తప్పు పడుతూ ఆయన చాలా సేపు మాట్లాడారు. నిష్టూరం అడారు కూడా. కానీ, ఆ తర్వాత మామూలుగా అయిపోయి, మేం అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చారు.
ఇకపోతే, ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెసు పార్టీ నాయకులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలు చేస్తూ కోర్టుకు కూడా ఎక్కారు. అప్పుడు, మరో సమయంలోనో గానీ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను ఎలా పెరిగింది, ఎలా ఎదిగింది - ఇలా తన జీవిత ప్రయాణ క్రమాన్ని వివరిస్తూ వచ్చారు. ఒక సందర్భంలో ఆయన కన్నీరు కూడా పెట్టుకున్నట్లు గుర్తు. నిజంగా, ఆ రోజు గుండె కరిగి నీరైంది.
ఎన్టీ రామారావుకు ఇతరుల మీద ఈర్ష్యాద్వేషాలు ఉండేవి కావనే నాకు అనిపించింది. కానీ, తీవ్రమైన భావోద్వేగం మాత్రం ఉండేది. ప్రజలకు మేలు జరుగుతుందని అనుకుంటే ఆ పని చేసి తీరేవారు. ఎవరైనా నచ్చజెప్పేవారు ఉంటే, మేలు జరుగుతుందంటే, తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి కూడా వెనకాడేవారు. అలాంటి ఓ సంఘటన కూడా నా అనుభవంలో ఉంది. ఏమైనా, ఎన్టీ రామారావు సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఓ ఉత్తుంగ తరంగం. అటువంటి నేత మళ్లీ రాకపోవచ్చు కూడా.
మరో విషయమేమంటే - ఆయన కేవలం తన ఇమేజ్ కారణంగానే మహా నాయకుడు కాలేదు. ఆయనకు స్పష్టమైన సామాజిక, రాజకీయ దృక్పథం ఉండేది. సామాజికంగా ద్రావిడ సంస్కృతికి, సోషలిస్టు దృక్పథానికి ఆయన చెందుతారు. రాజకీయంగా చూస్తే - భారతదేశాన్ని ఆయన ఫెడరల్ వ్యవస్థగా చూశారు. అందుకే గవర్నర్ల వ్యవస్థను ఆయన చీల్చి చెండాడు. రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యాన్ని ఎల్లవేళలా నిరసిస్తూ వచ్చాడు. ధైర్యసాహసాలకు మారు పేరైన ఎన్టీ రామారావు తన రాజకీయ, సామాజిక దృక్పథం రీత్యా కాంగ్రెసుకు ప్రత్యర్థిగా నిలిచారు. దేశంలో ఆ కాంగ్రెసు వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించారు. అటువంటి సందర్భం దేశరాజకీయాల్లో మళ్లీ రాకపోవచ్చు. సిద్ధాంత దృక్ఫథంపై సంకీర్ణం ఏర్పడడమనేది ఆనాటి రాజకీయంలోని సానూకల లక్షణం.
- కాసుల ప్రతాపరెడ్డి
ఎడిటర్, వన్ ఇండియా తెలుగు












Click it and Unblock the Notifications