తెలంగాణను బాబు, జగన్ అడ్డుకున్నారు: కెసిఆర్

ఎవరు రాజకీయ వ్యభిచారి అని ఆయన అడిగారు. మామూలు రాజకీయ చేరిక కాదని, ప్రజల ఆకాంక్ష కోసం కడియం తెరాసలో చేరారని, రాజకీయం కడియం శ్రీహరికి కొత్త కాదని, ఉన్నత స్థానంలో పనిచేశారని, ఎమ్మెల్యోనో ఎంపినో కావడానికి కాదని, తెలంగాణ జాతి ఏకం కావాల్సిన సందర్భాన్ని కడియం గుర్తు చేశారని ఆయన అన్నారు. కడియం శ్రీహరి చేరిక చిల్లరమల్లర రాజకీయం కాదని ఆయన అన్నారు.
దేవాదులను 18 నెలల్లో పూర్తి చేస్తామని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారని, ఇప్పటికీ అది పూర్తి కాలేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉప్పెనలా ఎగిసిపడుతోందని ఆయన అన్నారు. ఇతర ప్రాంతాల నాయకులను కూడా పార్టీలోకి తేవాలని, తెలంగాణ బిడ్డలు ఏకం కావాల్సిన సమయమని నచ్చజెప్పాలని ఆయన సూచించారు.
తెలంగాణ రాకుండా ఉద్యమం ఎటమటం అయితే ఆంధ్రవాళ్లు మనల్ని బతకనివ్వరని, రాష్ట్రాన్ని సాధించడం తప్ప ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు ఆంధ్ర పార్టీలు అవసరమా అనే చర్చ ప్రజల్లో పెట్టాలని ఆయన అన్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల్లో తెలంగాణ నేత ముఖ్యమంత్రి అవుతాడా, పార్టీ అధ్యక్షుడు అవుతాడా, శానససభలో లేదా శాసనమండలిలో సభాధ్యక్షుడు అవుతారా అని ఆయన అడిగారు. తెలంగాణవాళ్లు శాశ్వత గులాంలుగా ఉండాలని అంటున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెసు పేరుకు జాతీయ పార్టీ అని ఆయన అన్నారు. ఆంధ్ర ఆధిపత్యంలోనే, పెత్తనంలోనే కాంగ్రెసు పార్టీ ఉందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలను బొంద పెట్టి, వందకు పైగా ఎమ్మెల్యే స్థానాలు, 15 ఎంపి స్థానాలు గెలిపించుకుని తెలంగాణ సాధించుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని అనగానే ఆంధ్ర జీవులన్నీ ఒక్కటై ఆపారని ఆయన అన్నారు. వైయస్ జగన్, చంద్రబాబు తెలంగాణను ఆపారని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా జగన్ ప్లకార్డు ప్రదర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అమలు చేసే పథకాల గురించి ఆయన వివరించారు.
ఆలస్యమైనా వచ్చా: కడియం
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడం కాస్తా ఆలస్యమైందని కడియం శ్రీహరి అన్నారు. పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరిన తర్వాత ఆయన ప్రసంగించారు. జన్మనిచ్చిన, అవకాశాలు కల్పించిన తెలుగుదేశం పార్టీని వదులుకోలేక, ఆ పార్టీతో రాజీపడలేక, తెలంగాణ ఉద్యమంలో కలిసి నడవలేక మనస్తాపానికి గురైనట్లు ఆయన తెలిపారు.
రాజకీయంగా జన్మనిచ్చిన టిడిపి కన్నా తనకు జన్మనిచ్చిన తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడానికి, తెలంగాణకు విముక్తికి సైనికుడిలా పనిచేయడానికి తెరాసలోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. సీమాంధ్ర పార్టీలో బంధాలు తెంచుకోలేక, తెలంగాణ తల్లి రుణం తీర్చుకోలేక మనస్తాపానికి గురై ఆత్మవంచన చేసుకుంటున్న నాయకులు తెరాసలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సీమాంధ్ర పార్టీలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడబోవని, తెలంగాణను అడ్డుకుంటాయని ఆయన అన్నారు.
సీమాంధ్ర పార్టీల్లోని తెలంగాణ నాయకులు ప్రజా ఉద్యమంలోకి, తెరాసలోకి రావాలని, అందరం కలిసి తెలంగాణ సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ప్రజా ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకుడు కెసిఆర్ అని ఆయన అన్నారు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని విమర్శలు చేసినా కెసిఆర్ నాయకత్వంలోని తెరాస ద్వారానే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు.
మిగతా రాజకీయ పార్టీలకు అనేక ఎజెండాలుంటాయని, నాలుగైదు అంశాల్లో తెలంగాణ ఒక అంశంగా ఉంటుందని, తెరాస తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేస్తోందని, అయోమయం లేకుండా ముందుకు పోతున్న తెరాస ద్వారా తెలంగాణ సాధించుకోవడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తన వైపు నుంచి ఏ విధమైన సమస్యలుండవని, తెలంగాణ కోసం సైనికుడిలా పనిచేస్తానని కడియం శ్రీహరి చెప్పారు. 1983లో సామాజిక న్యాయం కోరుకున్న తెలంగామ ప్రజలు ఇప్పుడు తెలంగాణను కోరుకుంటున్నారని, అందుకే తెరాసలో చేరానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications