ధైర్యం చెప్తున్న షర్మిల: వెయిట్ చేయాలని విజయమ్మ

ప్రజలు తమ సమస్యలను షర్మిలకు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వారికి ధైర్యం చెబుతూ పాదయాత్ర చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర బుధవారానికి 156వ రోజుకు చేరుకుంది. షర్మిల పాదయాత్రలో ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.
కడిగిన ముత్యంలా వస్తాడు: విజయమ్మ
జగన్ కడిగిన ముత్యంలా జైలునుంచి బయటకు వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కడప జిల్లాలో అన్నారు. జగన్ అరెస్టుకు నిరసనగా ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీని చేపట్టనున్నట్లు చెప్పారు. సిబిఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని డైరెక్టర్ రంజిత్ సిన్హాయే స్వయంగా పేర్కొన్నారన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీనుంచి బయటకు వచ్చినందుకే జగన్‌ను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.
కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ కూడా జగన్ కాంగ్రెస్ పార్టీలో ఉండిఉంటే ఈపాటికే మంత్రికానీ, ముఖ్యమంత్రిగానీ అయ్యేవాడని తెలిపారన్నారు. వైయస్ అధికారంలో ఉన్నప్పుడు జారీ చేసిన 26 జీవోలపై మాత్రమే ఆరోపణలు వచ్చాయన్నారు. ఏడు నెలల సమయం ఉన్నప్పటికీ ప్రభుత్వం కౌంటరు ఫైలు కూడా దాఖలు చేయలేదన్నారు. జగన్ జైలు నుండి విడుదలై త్వరలో బయటకు వస్తారని, అప్పటి వరకు వెయిట్ చేయాలని విజయమ్మ పులివెందుల ప్రజలకు చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చేముందు వైయస్ ఇచ్చిన వాగ్దానాలు గాలికొదిలి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని చెబితే నమ్మేందుకు ప్రజలేమైనా పిచ్చోళ్లా..? అంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జూపూడి ప్రభాకర్ వేరుగా అన్నారు. జగన్‌ను ఆర్థిక ఉగ్రవాది అంటున్న మంత్రులు ఆ 26జీఓలు సక్రమమే అని సుప్రీం కోర్టుకు ఎలా చెప్పారని ప్రశ్నించారు. వైయస్ వల్ల మంత్రులైన నేతలు కాంగ్రెస్ రాష్ట్ర సమావేశంలో ఆయన ఫొటో కూడా పెట్టలేదన్నారు.












Click it and Unblock the Notifications