తెలంగాణ: టిఆర్ఎస్ రివర్స్ గేర్, టిడిపిదే నిజమైందా?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గత కొంతకాలంగా వచ్చే ఎన్నికలలో వంద అసెంబ్లీ, 15 ఎంపీ స్థానాలు కైవసం చేసుకొని తెలంగాణ సాధించుకోవాలని చెబుతున్న విషయం తెలిసిందే. ఎక్కువ సీట్లను సాధిస్తే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించవచ్చుననేది తెరాస వాదన. అయితే, ఇటీవల తెలంగాణవాద రేసులో బిజెపి దూసుకెళ్తోంది. తెరాసకు ధీటుగా తెలంగాణవాదాన్ని బిజెపి వినిపిస్తున్న విషయం తెలిసిందే.
దీంతో టిడిపి, కాంగ్రెసుతో పాటు తెరాసకు చెందిన పలువురు సీనియర్ నేతలు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారు. తమ అధినేత పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు తెరాస నేతలు, కెసిఆర్‌తో జత కట్టకూడదని భావిస్తున్న నాగం జనార్ధన్ రెడ్డి వంటి నేతలు బిజెపిలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో తెరాస సహా అన్ని పార్టీలకు చెందిన నేతలు బిజెపితో టచ్‌లో ఉంటున్నారు.
తెలంగాణ ప్రాంతంలో బిజెపి మతతత్వవాదం కప్పిపుచ్చుకు పోయింది. ఇప్పుడు తెలంగాణవాదమే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుండి పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే నాగం జనార్ధన్ రెడ్డి చేరుతానని ప్రకటించారు. ఈ రోజు తెరాసకు రాజీనామా చేసిన రుమాండ్ల రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలో బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయి. తెరాస బహిష్కృత నేత రఘునందన రావు కూడా బిజెపి వైపే చూస్తున్నారు.
తెలంగాణవాదం విషయంలో తమకు బిజెపి పోటీకి రావడంతో తెరాస తమ వాదనపై రివర్స్ గేర్ వేస్తోందని అంటున్నారు. ఇన్నాళ్లు ఓట్లు, సీట్లతోనే తెలంగాణ సాధ్యమని చెప్పిన తెరాస ఇప్పుడు సీట్లకు తెలంగాణకు సంబంధం లేదని చెబుతున్నారని అంటున్నారు. సర్వేల ప్రకారం వచ్చే ఎన్నికల్లో తెరాసకు 12 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సర్వే ప్రకారం తెలంగాణలో నరేంద్ర మోడీ ప్రచారం చేస్తే తెరాస సీట్లు 7కు పడిపోయి బిజెపికి ఐదు సీట్లు వస్తాయని తేల్చింది.
వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న తెరాస తెలంగాణకు సీట్లకు సంబంధం లేదని ఇప్పుడు చెబుతున్నారని అంటున్నారు. ఇన్నాళ్లు తెలుగుదేశం, కాంగ్రెసు అదే వాదన చేసింది. ఓట్లు సీట్ల కోసం కెసిఆర్ చూస్తున్నారని, తెలంగాణకు సీట్లకు సంబంధం లేదని వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈటెల వ్యాఖ్యలతో టిడిపి వాదనే నిజమయిందని కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications