తగ్గిన వైయస్ జగన్ హవా: చంద్రబాబు వర్సెస్ కెసిఆర్

KCR, Ys Jagan and Babu
హైదరాబాద్: రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హవా తగ్గినట్లు అనిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు మధ్య రాజకీయ సమరం సాగుతోంది. ఇరువైపులా వలసలు జరుగుతున్నాయి. తెరాస వైపు ఏకపక్షంగా కాకుండా తెలుగుదేశం వైపు కూడా వలసలు సాగుతుండడంతో ఈ పరిస్థితి వచ్చినట్లు కనిపిస్తోంది.

హెడ్‌లైన్స్ టుడే, సీ ఓటర్ సర్వే తర్వాత పరిస్థితి మరింతగా మారినట్లు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు లోకసభకు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ పది, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 11 స్థానాలు వస్తాయని ఆ సర్వే తెలిపింది. దీన్నిబట్టి వైయస్సార్ కాంగ్రెసు సీమాంధ్రలో ఏకపక్షంగా ఫలితాలు సాధించే పరిస్థితి లేదని తేలింది. దీంతో చంద్రబాబులో ఉత్సాహం పెరిగింది. వైయస్ జగన్ ప్రాబల్యం, వైయస్ రాజశేఖర రెడ్డిపై సానుభూతి ఎన్నికల నాటికి పూర్తిగా తగ్గుతుందని తెలుగుదేశం వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సర్వేను బట్టి తెలంగాణలో కెసిఆర్ పూర్తి ప్రాబల్యాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆ పార్టీకి బిజెపి పెద్ద ఆటంకంగా మారింది. బిజెపి తెరాస బలానికి కళ్లెం వేస్తూ తన బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి వంటి బలమైన నాయకులతో తెరాసను వచ్చే ఎన్నికల్లో నిలువరించాలని బిజెపి చూస్తోంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు తెరాస నాయకులను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

తెరాస నాయకులు తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించి మాజీ పార్లమెంటు సభ్యుడు చాడ సురేష్ రెడ్డిని, మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మరో మాజీ ఎంపి రుమాండ్ల రామచంద్రయ్యను చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి డికె సమరసింహారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇలా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో తన బలాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. పార్టీ నుంచి వెళ్లిపోయేవారే కాదు, పార్టీలోకి వచ్చేవారు కూడా ఉన్నారని చెప్పుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తుందని అంచనాలు వేశారు. కానీ ఆ వలసలకు పెద్ద యెత్తున కళ్లెం పడినట్లు అర్థమవుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. అలాగే, మరో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగింది. పలువురు కాంగ్రెసు శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ, ఆ విధమైన వలసలు ఆచరణ రూపం ధరించడం లేదు.

ఎన్నికల నాటికి తమ పార్టీలోకి చాలా మంది వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల మాట ఎలా ఉన్నా తెలంగాణ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు పెద్దగా జరిగే అవకాశం లేదని భావిస్తున్నారు. తెరాసకు ఓ వైపు తెలుగుదేశం పార్టీ, మరో వైపు బిజెపి ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెరాసకు సవాల్ విసరలేకపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+