హోంను పెట్టేసుకున్న కిరణ్: దామోదరకు జానాతో చెక్

తనపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్న వారిని సాధ్యమైనంతగా దూరం పెట్టి తనకు అనుకూలంగా ఉండే వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కిరణ్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారు. సబిత, ధర్మానలు రాజీనామా చేయడంతో పునర్వ్యవస్థీకరణ తప్పకుండా ఉంటుందని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.
ముఖ్యమంత్రి రేపటి నుండి రోజుల రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. ఆ తర్వాత 29న ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 30వ తేదిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఇతర కాంగ్రెసు పెద్దలతో, 31న అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీలో పునర్వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకుంటారు. దాదాపు పునర్వ్యవస్థీకరణకే అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.
కిరణ్ వద్దే హోం, రహదారులు
సబిత, ధర్మానలు రాజీనామాలు చేయడంతో వారు నిర్వర్తించిన హోం, రహదారుల శాఖను ఎవరికిస్తారోననే చర్చ కాంగ్రెసు వర్గాల్లో సాగింది. అయితే ప్రస్తుతానికి ఆ శాఖలను కిరణ్ తన వద్దే అట్టి పెట్టుకున్నారు. జూన్ 10 నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ లోగా ఎవరికైనా అప్పగించాల్సి ఉంటుంది! పునర్వ్యవస్థీకరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే ఉద్దేశ్యంతోనే ప్రస్తుతానికి కిరణ్ వాటిని తన వద్ద అట్టిపెట్టుకున్నారని అంటున్నారు.
మహిళ కాదంటే...
శాసనసభ సమావేశాలకు ముందే పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశాలు ఉన్నాయి. అధిష్టానం ఒకే అంటే వెంటనే విస్తరణ చేపడతారు. ఇన్నాళ్లు హోంను సబితా ఇంద్రా రెడ్డి నిర్వహించిన అదే తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళకు అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారట. మెదక్ జిల్లాకు చెందిన సునితా లక్ష్మా రెడ్డి, గీతా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డికె అరుణలు తెలంగాణ ప్రాంతం నుండి మహిళలుగా ఉన్నారు.
ఇందులో సునిత పేరు ప్రతిపాదనకు వచ్చినప్పటికీ ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన దామోదర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీంతో సునితా లేదా గీతా రెడ్డికి ఇచ్చే అవకాశాలపై తర్జన భర్జన పడుతున్నారట. డికె అరుణకు ఇచ్చే విషయమై కూడా చర్చ సాగుతోందట. అలాకాకుండా తనకే ఇవ్వాలని దామోదర పట్టుబట్టి లాబియింగ్ చేసిన పక్షంలో సీనియర్ నేత అయిన జానా రెడ్డిని కిరణ్ తెరపైకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. శ్రీధర్ బాబు, డి.శ్రీనివాస్ కూడా రేసులో ఉన్నారట. కాగా, సబితా ఇంద్రా రెడ్డి వచ్చే నెల 7వ తేదిన కోర్టు మెట్లు ఎక్కనున్నారు.












Click it and Unblock the Notifications