ఢిల్లీని శాసిద్దాం, తెలంగాణ సాధించుకుందాం: కెసిఆర్

కాంగ్రెసును బొంద పెట్టి తెలంగాణ సాధించుకుందామని ఆయన అన్నారు. నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ చెప్తే ప్రజలు నమ్మడం లేదని, ఆజాద్ రోజుకో మాట, పూటకో వాగ్దానం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణను అపహాస్యం చేసే విధంగా ఆజాద్ గతంలో మాట్లాడారని ఆయన అన్నారు. తెరాసలో చేరిన ఎంపీలు బేరసారాలు ఆడారని ఆజాద్ అంటున్నారని, ఏం బేరసారాలు ఆడారో చెప్పగలరా అని ఆయన అన్నారు.
ఫ్యామిలీ ప్యాకేజీలు అంటూ మీడియాలోని ఓ వర్గం కారుకూతలు కూస్తోందని, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఓ వర్గం మీడియా వ్యవహరిస్తోందని ఆయన విమర్సించారు. ఆంధ్ర పార్టీలు మనకు అవసరమా అని ఆయన అడిగారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో తెలంగాణవాళ్లు ముఖ్యమంత్రి గానీ, పార్టీ అధ్యక్షుడు గానీ కాగలరా అని ఆయన అడిగారు. కాంగ్రెసు పేరుకు మాత్రమే జాతీయ పార్టీ అని ఆయన అన్నారు. కాంగ్రెసు అధికారంలోకి రాదని అన్నారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, శాసనసభ స్పీకర్, శాసనసమండలి చైర్మన్ వంటి కీలకమైన పదవులన్నీ ఆంధ్ర నాయకులకే ఇచ్చారని ఆయన అన్నారు. కాంగ్రెసు ఆంధ్ర పెత్తనంలో ఉందని అన్నారు.
తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనని ముఖ్యమంత్రి మాట్లాడితే తెలుగుదేశం, కాంగ్రెసు దద్దమ్మలు, సన్నాసు మాట్లాడలేదని ఆయన అన్నారు. మోసపోయింది, దగాపడ్డది చాలునని, బలిదానాలు వద్దని, తెలంగాణ సాధించుకుందామని ఆయన అన్నారు. ఢిల్లీని శాసించి తెలంగాణ సాధించుకుందామని ఆయన అన్నారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేస్తామని, తెలంగాణ ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసు ఎంపీలు మందా, వివేక్ గట్టిగానే ప్రయత్నాలు చేశారని, తమతో పాటు సోనియా ఎదుట ఆందోళనకు దిగారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం పవిత్రమైందని, ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత తనకు పదవులు అక్కరలేదని, కాపలా కుక్కలా ఉంటానని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళిత నాయకుడే అవుతాడని ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఆత్మగౌరవంతో బతుకుదామని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 120 గజాల స్థలంలో దళితులకు ఇళ్ల నిర్మాణం చేసి ఇస్తామని ఆయన చెప్పారు. హైదరాబాదులో తెలంగాణవాదం లేదని సీమాంధ్రులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ నెల 14వ తేదీన తెలంగాణ జెఎసి తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
వేచి చూడాల్సిన అవసరం లేదు: కెకె
తెలంగాణ కోసం ఇంకా వేచి చూడాల్సిన అవసరం లేదని ఆదివారం తెరాసలో చేరిన కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావు అన్నారు. తెలంగాణ సాధన ప్రజల చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు తెలంగాణ సాధన కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. తెలంగాణ సాధన కోసమే తాము తెరాసలో చేరినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ సాధనే తన లక్ష్యం, తన ఊపిరి, తన ప్రాణం అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం ధర్మ యుద్ధమని అన్నారు. తెలంగాణ కోసం ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలని ఆయన అన్నారు.
బేరసారాలేమిటో చెప్పాలి: వివేక్
తమపై గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై తెరాసలో చేరిన పెద్దపల్లి ఎంపీ జి. వివేక్ మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీతో తాము ఏ బేరసారాలు ఆడామో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాము తెరాసలోకి వెళ్లేది పదవుల కోసం కాదని, తెలంగాణ కోసమని ఆయన చెప్పారు.
స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారుతున్నారని ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. కాంగ్రెసులో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనను వేధించారని, తన కంపెనీలకు నోటీసులు పంపి ముఖ్యమంత్రి ఇబ్బందులు పెట్టాలని అనుకున్నారని ఆయన చెప్పారు.
ఎన్ని రోజులో: మందా
తెలంగాణపై ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెసు పార్టీ తాజా గడువుకు ఎన్ని రోజులో చెప్పాలని తెరాసలో చేరిన నాగర్‌కర్నూలు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అడిగారు. నెల రోజుల లోపు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
నెలంటే 30 రోజులు కాదని, వారమంటే ఏడు రోజులు కాదన్న ఆజాద్ గడువుకు ఎన్ని రోజులో చెప్పాలని అన్నారు. తెలంగాణపై తేల్చాలని తొమ్మిదేళ్లుగా కాంగ్రెసును కోరుతూనే ఉన్నామని, ప్రజల ఆకాంక్ష మేరకే తెరాసలో చేరుతున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications