అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం- టాస్క్ ఫిక్స్..!!
అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. నిర్దేశిత లక్ష్యంగా మేరకు నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తున్నారు. రెండో విడత భూ సమీకరణ కొనసాగు తోంది. ఇదే సమయంలో రైతులకు ఇచ్చిన హామీల అమలు పైనా ప్రభుత్వం ఫోకస్ చేసింది. కాగా.. అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ మేరకు అధికారులకు దిశా నిర్దేశం చేస్తోంది.
కృష్ణా నది ఒడ్డున ప్రతిపాదిత అమరావతి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం, అలాగే కృష్ణా పుష్కరాలు-2028కి ముందు పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. అందులో భాగంగా అమరావతిలో 27 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్, 7 దీవుల అభివృద్ధికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2028 కృష్ణా పుష్కరాల నాటికి ఉద్దండరాయునిపాలెంలో 3 కిలోమీటర్ల పైలట్ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 1 కిలోమీటర్ మేర మెరీనాను ఏర్పాటు చేస్తారు. పర్యాటక, పర్యావరణ అనుకూల విధానాలతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నారు. అమరావతిలో చేపట్టే ఈ టూరిజం ప్రాజెక్టులపై అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) అధికారులతో మంత్రి నారాయణ ఈరోజు(శుక్రవారం) సమీక్ష నిర్వహించారు. అమ్యూజ్‌మెంట్ పార్క్, ఎకో టూరిజం పార్కులను పీపీపీ విధానంలో ఏడీసీఎల్ అభివృద్ధి చేయనుంది.

అధికారులకు కీలక ఆదేశాలు
ఈ నేపథ్యంలో అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణం పూర్తయ్యేసరికి టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి నారాయణ సూచించారు. సీఎం చంద్రబాబు సూచనలను పరిగణనలోకి తీసుకుని పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే టూరిజం ప్రాజెక్టుల కోసం భూములు కేటాయించిన మిగిలిన సంస్థలు కూడా త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని మంత్రి నారాయణ సూచించారు. స్టార్ హోటళ్ల కోసం ఎకరానికి రూ.8.20 కోట్ల ధరను సీఆర్డీఏ నిర్ణయించింది. అమరావతిలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర. సీఆర్డీఏ పరిధిలో స్టార్ హోటళ్లకు 9.19 ఎకరాలు.. ప్రైవేట్ స్కూళ్లకు 15.80 ఎకరాల భూమిని కేటాయించారు. స్కూల్ నిర్మాణం కోసం 33ఏళ్ల పాటు భూమిని లీజుకు తీసుకోవచ్చని వెల్లడించారు.













Click it and Unblock the Notifications