హైదరాబాద్ లో మరో కొత్త భారీ 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన.. ఆ మార్గంలోనే!
హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు తలపెట్టిన భారీ ఫ్లైఓవర్ల ప్రాజెక్టుపై జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రతిపాదించిన ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణ ప్రణాళికను పూర్తిగా రద్దు చేసింది. దీనికి బదులు పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు ఒకే ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించింది.
అసలు ప్రణాళిక ప్రకారం కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జూబ్లీ చెక్‌పోస్ట్, కేబీఆర్ గేట్, ముగ్ధా జంక్షన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వంటి చోట్ల పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించాలని భావించారు. దీని అంచనా వ్యయం రూ.826కోట్ల నుంచి రూ.1,090కోట్ల వరకు పెరిగింది. కొన్ని చోట్ల గుంతలు తవ్వడం, ప్రాథమిక పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ట్రాఫిక్ ఇప్పటికే సజావుగా సాగుతున్నందున భారీ ఖర్చు అవసరం లేదని అధికారులు భావించారు.

కేబీఆర్ పార్క్ చుట్టూ ఇప్పటికే అమలులో ఉన్న వన్‌వే వ్యవస్థ వల్ల ట్రాఫిక్ బాగా మెరుగుపడింది. దీంతో ఈ వన్‌వే విధానాన్ని శాశ్వతం చేయాలని, రోడ్లను ఆరు లేన్లకు విస్తరించాలని నిర్ణయించారు. దీనితో పాటు పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్ ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ వరకు సుమారు 4.4 కిలోమీటర్ల పొడవున ఆరు లేన్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఈ కారిడార్ వల్ల పంజాగుట్ట నుంచి జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనదారులకు సిగ్నల్ లేకుండా నేరుగా ప్రయాణం సాధ్యమవుతుంది. నాగార్జున సర్కిల్ వద్ద ఎక్కితే జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద దిగవచ్చు. అలాగే వ్యతిరేక దిశలో కూడా సౌకర్యం ఉంటుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1 వైపు వెళ్లేందుకు ప్రత్యేక ర్యాంప్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
జీహెచ్‌ఎంసీ స్థాయీ సంఘం సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ అధ్యక్షతన ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సహా అధికారులు హాజరయ్యారు. కొత్త ప్రణాళికకు సంబంధించిన డిజైన్లు, ఖర్చు అంచనాలు త్వరలో సిద్ధం చేయాలని సూచించారు. గతంలో కాంట్రాక్టులు ఇచ్చిన కంపెనీలతోనూ చర్చలు జరుగుతాయి. ఈ మార్పు వల్ల భారీగా ఖర్చు తగ్గే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications
