ఎన్టీఆర్ ఫ్యామిలిని తొక్కేసి లోకేష్‌కా?: బాబుకు షర్మిల

''చంద్రబాబు ఎన్నో సినిమా డైలాగులు చెప్తున్నారు. తాను లోక కల్యాణం కోసం పాటు పడుతున్నానని చెప్తున్నారు. తనకు స్వార్థం లేదని, ప్రజాసేవే ముఖ్యమని, రాష్ట్రంలో వెలుగులు నింపుతానని, ధర్మ పోరాటం చేస్తున్నానని, తాను అవినీతి మీద పోరాటం చేస్తున్నానని.. ఇలా చంద్రబాబు డైలాగులు చెప్తున్నారు. బాబుగారికి లోక కల్యాణం అంటే ఏమిటో తెలిసినట్టు లేదు. లోక కల్యాణం అంటే లోకంలోని ప్రజలకు మేలు చేయడం.
ఒక్క ఆయన కుమారుడు లోకేశ్‌కు మేలు చేయాలనుకుంటే అది లోక కల్యాణం కాదు. మన రాష్ట్రంలో ఒక ప్రభుత్వం నిలబడటానికి 148 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం 146 మాత్రమే, అది కూడా అసమ్మతి ఎమ్మెల్యేలను కూడా కలుపుకొంటే. మరి మైనార్టీలో ఉన్న ఈ కాంగ్రెస్ ఎలా అధికారంలో ఉంది? కిరణ్ కుమార్ రెడ్డి ఎలా పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మద్దతుతో కాదా?'' అని ఆమె విమర్శించారు.
టిడిపిని కబ్జా చేసి.. నందమూరి కుటుంబాన్ని తొక్కేసి.. లోకేష్‌ను మాత్రమే పైకి తేవాలనుకోవడం లోక కల్యాణం కాదన్నారు. లోకాన్ని దోచుకొని బాబు ఆస్తులు సంపాదించుకుంటే... జెండా పట్టుకున్న కార్యకర్తలు ఆస్తులు అమ్ముకోవాలా అని ప్రశ్నించారు. నరకాసురుడికి మళ్లీ ప్రజలు అవకాశమిస్తారా అన్నారు. గాడ్సే వచ్చి మహాత్మా గాంధీ ట్రస్టుకు తనను అధ్యక్షుడిని చేయమంటే చేస్తారా? చంద్రబాబుకు మళ్లీ అధికారం ఇస్తే మన రాష్ట్రానికి అధోగతే అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల మనిషి కాదన్నారు.












Click it and Unblock the Notifications