హింసను సహించం, రాష్ట్రాలతో కలిసి పని చేస్తాం: ప్రధాని

ఈ నెల 10వ తేదిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల సమావేశం ఉంటుందన్నారు. 34 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. గత కొన్నేళ్లుగా మావోయిస్టుల దాడులు తగ్గాయని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రత పెంచడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నామన్నారు. మావోల దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదం, భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కొనేందుకు రాష్ట్రాలతో కలిసి పని చేస్తామన్నారు.
దేశంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెసు నేతల పైన మావోయిస్టుల దాడి ప్రజాస్వామ్యం పైన దాడిగా అభివర్ణించారు. ఈశాన్యంలో శాంతి కార్యక్రమాల ద్వారా హింసను తగ్గిస్తున్నట్లు చెప్పారు.
తీవ్రవాదులు హవాలా, వెస్ట్రన్ యూనియన్ ద్వారా నిధులను అందుకుంటున్నారని షిండే తెలిపారు. నక్సల్స్ సమస్యను ఉపేక్షించమని, కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఆయుధాలు వదిలి వచ్చే ఏ తీవ్రవాద సంస్థతోనైనా చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉగ్రవాదంపై పోరులో రాష్ట్రాలకు పూర్తిగా సహకరిస్తామని చెప్పారు.
కాగా, ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల అంతర్గత సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కాలేదు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిజిపిలు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications