జగన్ ఓకే?: హిందూపురంపై నటుడు నరేష్ మమకారం

తాజాగా ఆయన జగన్ వైపు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. అప్పుడో ఇప్పుడో ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించే అవకాశాలున్నాయి. నరేష్ మొదటి నుండి అనంతపురం జిల్లాలోని హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి చేరినా అతను హిందూపురం టిక్కెట్ కోసమే అడిగే అవకాశాలున్నాయి.
మరోవైపు ఇప్పటికే హిందూపురం టిక్కెట్ పైన నరేష్‌కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిష్టానం నుండి హామీ కూడా వచ్చి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన బుధవారం ధర్మవరంలో మాట్లాడుతూ... తాను వచ్చే ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గం నుండి ఓ ప్రాంతీయ పార్టీ తరఫున పోటీ చేస్తానని కార్యకర్తలకు చెప్పారు. దీంతో ఆయనకు జగన్ నుండి హామీ లభించి ఉండవచ్చునని అంటున్నారు.
కాగా నరేష్ ఇటీవల ఒకటి రెండు సందర్భాలలో జగన్ పార్టీకి అనుకూలంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై నరేష్ మండిపడ్డారు.
ఆయన అనంతపురం జిల్లాలో ఆనంపై ధ్వజమెత్తారు. వైయస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆనంను ఉరి తీసినా తప్పులేదన్నారు. నాడు పదవుల కోసం వైయస్ రాజశేఖర రెడ్డిని పొగిడిన వారు ఇప్పుడు అదే అధికార దాహంతో ఆయనపై విమర్శలు గుప్పించడం దారుణమన్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications