బంగారుతల్లిపై వాదన: చర్చకు రాని డిఎల్ ఉద్వాసన

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సమావేశంలో ఏమీ మాట్లాడలేదు. పంచాయతీ రిజర్వేషన్లపై చర్చించాలని జానారెడ్డి చెప్పారు. దీనిపై బొత్స సత్యనారాయణ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ అంశంపై మంత్రులతో శనివారం మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. కేబినెట్ భేటీలో డీఏ మంజూరు సహా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇకనుంచి ప్రతి 15 రోజులకోసారి కేబినెట్ భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశ ప్రారంభంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇకనుంచి ప్రతి రెండో, నాలుగో శుక్రవారం తప్పనిసరిగా కేబినెట్ సమావేశం జరపాలని తీర్మానించారు.
మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బంగారుతల్లి పథకాన్ని వివరించారు. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం, ఈ పథకానికి చట్టబద్ధత కల్పించాలని మంత్రి దానం నాగేందర్ సూచించారు. వెంటనే బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకున్నారు. ఏ పథకానికీ లేని చట్టబద్ధత బంగారుతల్లి పథకానికే ఎందుకని ఆయన అడిగారు. ఈ పథకం అమలు విధివిధానాలపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాల్సి ఉందని, ఇందుకు పూర్తి స్థాయిలో చర్చ జరగాలని, అలా కాకుండా కేబినెట్‌కు నేరుగా ముసాయిదా చట్టం తీసుకురావడం సరికాదని ఆయన అన్నట్లు సమాచారం.
బొత్స సందేహానికి ముఖ్యమంత్రి జవాబిచ్చారు. బంగారు తల్లి పథకంపై ప్రజల్లో విశ్వాసం కల్పించడానికే చట్టబద్ధత కల్పించాలని యోచిస్తున్నామని తెలిపారు. ఈ బిల్లుకు శాసనసభ మలి దశ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదం పొందుతామని, చట్టాన్ని రూపొందించి ఏ ప్రభుత్వం వచ్చినా తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి జానారెడ్డి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ పథకం మంచిదేనని, చట్టబద్ధత కల్పించడానికి తాను వ్యతిరేకం కాదని, కానీ, దీని అమలుపై కొన్ని సందేహాలు ఉన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications