జగన్‌కు సిబిఐ కోర్టులో చుక్కెదురు: పిటిషన్ తోసివేత

వైయస్ జగన్ ఆస్తుల కేసులో అంశాలవారీగా సిబిఐ దర్యాప్తు చేపట్టి, అదే క్రమంలో కోర్టులో చార్జిషీట్లను దాఖలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అలా కాకుండా అన్ని చార్జిషీట్లను కలిపి ఒకేసారి విచారించాలని కోరుతూ జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇప్పటి వరకు సిబిఐ ఐదు చార్జిషీట్లను దాఖలు చేసింది. మరిన్ని చార్జిషీట్లను కూడా దాఖలు చేయడానికి సిద్ధపడింది. ఈ స్థితిలో దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్నింటిని కలిపీ ఒకేసారి విచారణ జరపాలని జగన్ తరఫు న్యాయవాది కోరారు. విడివిడి చార్జిషీట్లపై విడివిడిగా విచారణ జరిగిన దాఖలాలు లేవని ఆయన వాదించారు.
ఇంకా కొన్ని చార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉందని, ఒక్కొక్కటిగానే విచారణ జరపాలని, జగన్ జైలులో ఉన్నప్పుడే దాఖలైన పిటిషన్లపై విచారణ చేపడితే సాక్షులను ప్రభావితం చేయడానికి వీలుండదని సిబిఐ వాదించింది. సిబిఐ వాదన వైపే కోర్టు మొగ్గు చూపింది. కాగా, సిబిఐ కోర్టు తీర్పును వైయస్ జగన్ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!