పిరికిపందలు, చిరు అమ్మాక బాబు ముందుకు: షర్మిల

కొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు వస్తాయని, వీరు అప్పుడెలా తప్పించుకుంటారన్నారు. పదవీ త్యాగాలకు సిద్ధపడి, జగన్ మాట మేరకు 9 మంది కాంగ్రెస్, ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతుగా ఓటేశారని, కాంగ్రెస్, టిడిపిలు భయపడకపోతే మార్చి నెలలో విప్ ధిక్కరించినప్పుడే ఈ ఎమ్మెల్యేల మీద వేటు వేయలేదేం? వీళ్లకు భయమే లేకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీల గుర్తులతోనే పోటీ చేస్తామని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
ప్రజా వ్యతిరేక కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలూ కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే, చంద్రబాబు ప్రజల పక్షాన నిలబడకుండా నిస్సిగ్గుగా కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన నిలబడ్డారని, వాళ్ల ఎమ్మెల్యేలను అవిశ్వాసానికి మద్దతు పలకొద్దని విప్ జారీ చేసి మరీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడారని ఆరోపించారు. నిజానికి అవిశ్వాసం పెట్టడానికి కారణం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు పాలన, కరెంటు బాదుడు, చార్జీల మోత అని, వేటు పడుతుందని తెలిసి, పదవులు కోల్పోతారని తెలిసి, వారి పార్టీలు వాళ్లను వెలేస్తాయని తెలిసి కూడా 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు టిడిపి ఎమ్మెల్యేలు విప్‌ను ధిక్కరించి అవిశ్వాసానికి మద్దతు పలికారన్నారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలి పోదు అంటే అవిశ్వాసం... కూలిపోతుందీ అంటే విప్ ద్వారా విశ్వాసం.. ఇదీ చంద్రబాబు నాటకమన్నారు. ఎమ్మార్, ఐఎంజీలాంటి కేసుల్లో విచారణ జరగకుండా ఉండేందుకు, సిబిఐని ఉసిగొల్పకుండా ఉండటానికి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై చంద్రబాబు చేస్తున్న నీచమైన రాజకీయాల్లో భాగం ఇదన్నారు. బాబుకు నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసే ధైర్యం ఎప్పుడూ లేదని, విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడే లక్షణాలు ఎప్పుడూ లేవన్నారు.
అందుకే గతంలో చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో కలవకముందే బాబు అవిశ్వాసం పెట్టకుండా, ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్ముకున్న తరువాత, కాంగ్రెస్‌కు ఇక ఢోకా లేదని, కూలిపోదని తెలిసిన తరువాతే అవిశ్వాసం పెట్టారన్నారు. ఇప్పుడు కూడా 15 మంది ఎమ్మెల్యేల మీద వేటు వేశాక, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోదనే భరోసా కలిగిన తరువాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ డెరైక్షన్‌లో అవిశ్వాస డ్రామా ఆడటానికి సిద్ధపడుతున్నారని ఆరోపించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!