దమ్ముందా?: కెసిఆర్ పైకి బిజెపిని ఎగేస్తున్న టిడిపి?

మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నప్పటికీ టిడిపి మాత్రం తెలంగాణలో పట్టు సాధించేందుకు తెరాస పైకి బిజెపిని ఉసిగొల్పుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణపై తాము నాలుగేళ్ల కిందటి తీర్మానానికి కట్టుబడి ఉన్నామని టిడిపి చెప్పడం తప్పితే టిడిపి అనుకూలమని చెప్పలేకపోతుంది. దీంతో ఆ పార్టీ ఇమేజ్ తెలంగాణలో డ్యామేజ్ అయింది. ఇటీవలే టిడిపి పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది.
సీమాంధ్రలో జగన్ హవా కూడా క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోను పట్టు కోసం టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే బిజెపిని తెరాసపైకి ఉసిగొల్పుతున్నట్లుగా కనిపిస్తోందని వారి వ్యాక్యలను బట్టి అర్థమవుతోందంటున్నారు. తెలంగాణ ప్రాంత టిడిపి సీనియర్ నేతలు పలుమార్లు.. తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని, తమను తెరాస ఎందుకు కలుపుకుపోవడం లేదని, తెలంగాణకు పూర్తిగా సానుకూలంగా ఉన్న బిజెపితోను కెసిఆర్ కలిసి వెళ్లడం లేదని పలుమార్లు ఆరోపించారు.
తెలంగాణ నేపథ్యంలో బిజెపి, తెరాసల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. తెలంగాణపై పట్టు కోసం రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బిజెపి ఎదిగి తెరాస ఓట్లకు గండిపడితే టిడిపి లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు అసెంబ్లీలో నాగం జనార్ధన్ రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర చర్చ సాగింది. బిజెపికి పట్టుంటే సిద్దిపేటలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో సభ పెట్టించాలని నాగంతో రేవంత్ అన్నారు. అందుకు నాగం కూడా సై అన్నారు.
వారిద్దరు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నప్పటికీ.. అందులో టిడిపి గూడార్థం కనిపిస్తోందని అంటున్నారు. తెరాసకు సిద్దిపేటలో మంచి పట్టు ఉంది. అక్కడ గతంలో కెసిఆర్, ఇప్పుడు హరీష్ రావు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. హరీష్ రావు గత ఉప ఎన్నికల్లో రికార్డ్ మెజార్టీతో గెలుపొందారు. ఇలాంటి సిద్దిపేటలో మోడీతో రేవంత్ సభ పెట్టించాలని చెప్పడం వెనుక గూడార్థముందంటున్నారు.












Click it and Unblock the Notifications