ప్రధాని పదవి: అద్వానీ మూడు షరతులు విధించారా?
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ సోమవారం మధ్యాహ్నం ఆ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. నరేంద్ర మోడీకి ప్రచార సారథ్య బాధ్యతలు కట్టబెట్టడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో మనస్థాపం చెందిన ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. పార్టీ పదవులకు రాజీనామా చేసి హెచ్చరికలు జారీ చేసిన అద్వానీ పార్టీ ముందు మూడు డిమాండ్లు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి.
మిడ్ డే పత్రిక ప్రకారం అద్వానీ మూడు డిమాండ్లను ఆదివారం అధిష్టానం ముందు ఉంచినప్పటికీ, పార్టీ వాటిని తిరస్కరించిందట. ఆ కథనం ప్రకారం.... అద్వానీ తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే షరతు కూడా విధించారు. ఇదే మొదటి షరతు. బిజెపి సారథ్యంలోని ఎన్డీయే 2014 ఎన్నికలలో అధికారంలోకి వస్తే తనను ఆరు నెలల పాటు ప్రధానిని చేయాలి.

బిజెపిలో ప్రధాని అభ్యర్థిగా అద్వానీ చాలాకాలం నుండి ముందంజలో ఉన్నారు. ప్రధాని కావడమనేది అద్వానీ కల. ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించడంతో, తన కల నెరవేరదని భావించిన అద్వానీ రాజీనామా వరకు వెళ్లారని అభిప్రాయపడుతున్నారు. ఆరు నెలలు తాను ప్రధాని పదవిలో కూర్చున్న తర్వాత దానిని వదులుకునేందుకు సిద్ధమని అద్వానీ చెప్పారట.
నరేంద్ర మోడీని కన్వీనర్‌గా నియమించాలనేది రెండో షరతు. ఆయనకు ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగించవద్దని షరతు విధించారట. ఒకవేళ మోడీకి ప్రచార సారథ్య బాధ్యతలు అప్పగిస్తే తనకు ముందుగానే తెలియజేయాలనేది మూడో షరతు. మోడీ అభ్యర్థిత్వాన్ని అద్వానీ వ్యతిరేకించడంతో ఆర్ఎస్ఎస్ సూచనల మేరకు అతనిని ప్రచార కమిటీ సారథిగా ఎన్నుకున్నారనే వార్తలు వచ్చాయి. దీంతో అద్వానీ రాజీనామాకు సిద్ధపడ్డారని అంటున్నారు. కాగా రాజీనామా చేసిన అద్వానీని అగ్రనేతలు బుజ్జగిస్తున్నారు.












Click it and Unblock the Notifications