వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చలో అసెంబ్లీ టెన్షన్: ఆంక్షలు, అరెస్టులు, బైండోవర్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ జెఎసి రేపు శుక్రవారం తలపెట్టిన చలో అసెంబ్లీ సందర్భంగా టెన్షన్ నెలకొంది. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. మరోవైపు, కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని తెలంగాణ జెఎసి నాయకులు ప్రకటిస్తున్నారు. పోలీసులు హైదరాబాదులోనే కాకుండా తెలంగాణ జిల్లాల్లో కూడా ఆంక్షలు పెట్టారు. జిల్లాల నుంచి తెలంగాణవాదులు తరలిరాకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలంగాణ జెఎసి నాయకులను అరెస్టు చేస్తున్నారు. బైండోవర్ చేస్తున్నారు.

హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు గురువారం రాత్రి 11 గంటల నుంచే అమలులోకి వస్తున్నాయి. శానససభ వైపు వెళ్లే దారులను అన్నింటినీ మూసేస్తున్నారు. హైదరాబాదులోని ఐదు ఫ్లైఓవర్లను మూసేస్తున్నారు. తెలుగుతల్లి, నారాయణగుడా, బషీర్‌బాగ్, మాసబ్‌ట్యాంక్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్లను మూసేస్తున్నారు. ట్రాఫిక్‌ను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. హైదరాబాదులో 17, సైబారాబాద్‌లో 58 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కరీంనగర్ తదితర జిల్లాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. జిల్లాల నుంచి హైదరాబాదుకు తెలంగాణవాదులు తరలిరాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద హైదరాబాదును అష్టదిగ్బంధం చేస్తున్నారు.

Telangana JAC

నిర్వహించి తీరుతాం: కోదండరామ్

రాష్ట్ర ప్రభుత్వం ధౌర్జన్యానికి, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. తాము శాంతియుతంగా ‘ఛలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పినా అనుమతి ఇవ్వకుండా, భారీగా పోలీసులను మోహరించి, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, ముందస్తుగా తెలంగాణవాదులను అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తోందని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా శుక్రవారం (14న) తాము తలపెట్టిన ‘ఛలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిర్వహించి తీరుతామని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు, ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన పార్టీలు రేపు ఇందిరా పార్క్ వద్దకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక వేళ పోలీసులు అడ్డుకుని నిర్భంధిస్తే ఎక్కడివాళ్లు అక్కడే నిరసన తెలియజేయాలని, శాంతియుతంగా జరగాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడవద్దని కోదండరాం విజ్ఞప్తి చేశారు.

రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎవరు తెలంగాణకు వచ్చినా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఒకే వేళ అనుకోని సంఘటనలు జరిగితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే బాధ్యత వహించాలని చెప్పారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మాది బాధ్యత: కెకె

చలో అసెంబ్లీ కార్యక్రమం శాంతియుతంగా జరిగేలా చూసే బాధ్యత తమదేనని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కె. కేశవ రావు చెప్పారు. తెరాస, బిజెపి, సిపిఐ శానససభ్యులు గురువారంనాడు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇప్పించాలని వారు గవర్నర్‌ను కోరారు. బైండోవర్‌ను వెంటనే నిలిపేయాలని, అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని కెకె కోరారు.

ప్రభుత్వం కావాలని అనుమతి ఇవ్వడం లేదని ఆయన అన్నారు. అనుమతి ఇవ్వకపోతే ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాగా, రేపు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విద్యాసంస్థలను మూసేస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది.

కడియం శ్రీహరి అరెస్టు

చలో అసెంబ్లీ కార్యక్రమానికి ఒక రోజు ముందు గురువారంనాడు వరంగల్ నుంచి బయలుదేరిన తెరాస పోలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరిని పోలీసులు జనగాంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా జనగాంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కడియం శ్రీహరిని వరంగల్‌లోని ఆయన నివాసానికి తరలించారు.మెరుపు సమ్మెకు హెచ్చరిక

‘ఛలో అసెంబ్లీ' నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ గురువారం టీఎన్‌జీవో భవన్‌లో సమావేశం నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్బంధకాండ జరుగుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని, అనుమతి ఇప్పించాల్సిన బాధ్యత తెలంగాణ మంత్రులదేని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు.

అరెస్టు చేసిన ఉద్యోగులను వెంటనే విడుదల చేయకపోతే అత్యవసర సేవలు బంద్ చేస్తామని, ఉద్యోగులమంతా మరో ఐక్య ఉద్యమానికి సిద్ధమౌతామని, మెరుపు సమ్మెకు కూడా సిద్ధమవుతామని శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. సాయంత్రంలోపు అరెస్టు చేసిన ఉద్యోగులను విడుదల చేయాలని చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని విఠల్ డిమాండ్ చేశారు. లేకపోతే రేపు ఉదయం సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

ప్రత్యామ్నాయం చూపించాం: హరీష్

‘ఛలో అసెంబ్లీ' కార్యక్రమం శుక్రవారం జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ వాదులను ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని తెరాస శాసనసభ్యుడు హరీష్‌రావు విమర్శించారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణవాదులపై అక్రమంగా కేసులు బనాయించడం ప్రభుత్వానికి హాబీగా మారిందని ఆయన దుయ్యబట్టారు. ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతినిప్పించాల్సిన బాధ్యత ఈ ప్రాంత మంత్రులదేనని ఆయన అన్నారు. తెలంగాణకు అడ్డుకాదని చెప్పే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఛలో అసెంబ్లీకి ఎందుకు మద్దతివ్వరని నిలదీశారు.

చలో అసెంబ్లీ కార్యక్రమానికి తాము ప్రత్యామ్నాయం కూడా చూపించామని, నిజాం కళాశాల మైదానంలో సభ నిర్వహించుకుంటామని చెప్పామని, అయినా ప్రభుత్వం వినడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం తన నీడను చూసి తానే భయపడుతోందని అన్నారు.

విజయవంతం చేయండి: పాల్వాయి

‘ఛలో అసెంబ్లీ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు , యువకులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఛలో అసెంబ్లీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా ఆంక్షలు విధించడం సరికాదని ఆయన మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు.

ఉన్నతాధికారులతో సిఎం సమీక్ష

చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటైన ఈ సమావేశానికి డిజిపి దినేష్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. హైదరాబాదులో ఏర్పాటు చేయాల్సిన భద్రతా ఏర్పాట్లపై సమావేశంలో సమీక్షించినట్లు సమాచారం.

పరీక్షలు వాయిదా

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రేపు శుక్రవారం జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ముందస్తు చర్యల్లో భాగంగా హైదరాబాదులోని బషీర్‌బాగ్‌లో ఉన్న నిజాం కళాశాల వసతి గృహాన్ని పోలీసులు ఖాలీ చేయించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో తెరాస నేత చెరుకు సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు, తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

రైళ్ల రద్దు

చలో అసెంబ్లీ కారణంగా కొన్ని రైలు సర్వీసులు రద్దవుతున్నాయి. లింగంపల్లి - సికింద్రాబాద్ మధ్య ఎంఎంటిఎస్ రైళ్లు నడుస్తాయి. కొన్నిరైళ్లను కొంత దూరం వరకు నడిపించాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణీత మార్గాల్లోనే రేపు హైదరాబాదులో బస్సులు నడుస్తాయి. తెలంగాణవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లల్లోనూ పటిష్టమైన బందోబస్తు ఏర్ప్టాట్లు చేశారు. భద్రతా బలగాలను మోహరించారు. తనిఖీలు నిర్వహిస్తున్నారు.

English summary
Tension prevailed due to the Telangana JAC proposed Chalo assembly on June 14. Police rejected permission to the Chalo assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X